
హైదరాబాద్, 03 జూలై (హి.స.)
నగరంలోని లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక హోటల్ గదిలో 26 ఏళ్ల యువతి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అల్వాల్ ప్రాంతానికి చెందిన రేణుక (26) గా గుర్తించబడిన సదరు యువతి, గురువారం రాత్రి గోల్కొండకు చెందిన తన ప్రియుడు ఫరూక్ (34) తో కలిసి ఎండీ లైన్స్ సమీపంలోని 'హోటల్ గ్రాండ్ లాడ్జ్' లో గదిని అద్దెకు తీసుకుంది. అయితే, శుక్రవారం తెల్లవారుజామున ఆమె హోటల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందినట్లు వెలుగుచూసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న లంగర్‌హౌస్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, నిందితుడు ఫరూక్‌కు ఇప్పటికే వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. రేణుకతో కొంతకాలంగా కొనసాగుతున్న పరిచయం నేపథ్యంలో ఇద్దరూ కలిసి హోటల్‌కు వచ్చారు. తాను కొద్దిసేపు వ్యక్తిగత పనిపై బయటకు వెళ్లి, తిరిగి గదిలోకి వచ్చేసరికి రేణుక ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిందని, వెంటనే తానే హోటల్ యాజమాన్యానికి, పోలీసులకు సమాచారం అందించానని ఫరూక్ పోలీసుల విచారణలో పేర్కొన్నాడు. కాగా, మరణానికి కొన్ని గంటల ముందు, అర్థరాత్రి 12:30 గంటల ప్రాంతంలో రేణుక తన మరొక స్నేహితురాలికి వీడియో కాల్ చేసిందని సమాచారం. మరుసటి రోజు తన పుట్టినరోజు కావడంతో, నీకోసం ఒక బర్త్‌డే గిఫ్ట్ దాచాను అని ఆమె ఆ స్నేహితురాలితో వ్యాఖ్యానించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, రేణుక కుటుంబ సభ్యులు ఫరూక్ చెబుతున్న కథనాన్ని పూర్తిగా తోసిపుచ్చుతున్నారు. ఇది ఆత్మహత్య కాదని, ఫరూకే తమ కుమార్తెను ప్లాన్ ప్రకారం హత్య చేసి, దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాడని వారు లంగర్‌హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మరియు అనుమానాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, ప్రియుడు ఫరూక్‌ను అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక మరియు ఫోరెన్సిక్ ఆధారాలు వచ్చిన తర్వాతే ఇది ఆత్మహత్యా లేక హత్యా అనే విషయాలపై స్పష్టత వస్తుందని, అన్ని కోణాల్లోనూ కేసును దర్యాప్తు చేస్తున్నామని ఉన్నతాధికారులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi