
తిరుపతి, 03 జూలై (హి.స.) అధికార తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తిరుపతి (Tirupati) అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీగా మన్నెం శ్రీనివాస ప్రసాద్ (Mannem Srinivas Prasad)ను నియమిస్తూ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు (Pall Srinivasa Rao) ఇవాళ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మన్నెం శ్రీనివాస ప్రసాద్ నియామకం జరిగిందని ఆయన ప్రకటించారు. అయితే, జిల్లాలో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి అరాచకాలను ఎదుర్కొనేందుకు అర్థబలం, రాజకీయ బలగం ఉన్న నేతను ఇంచార్జీగా నియమించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించిందని పేర్కొన్నారు. అందుకే మన్నెం శ్రీనివాస ప్రసాద్ సరైన నేతగా భావించామని, కొంతకాలం క్రితమే ఈ విషయంలో తుది నిర్ణయానికి వచ్చినా.. తిరుపతి నియోజకవర్గ నాయకులను ఒప్పించి ఒకతాటిపైకి తీసుకొచ్చేందుకు సమయం పట్టిందని, అందుకు ఇవాళ ఆయన పేరును ప్రకటించామని పల్లా శ్రీనివాస రావు పేర్కొన్నారు.
కాగా, ఇప్పటి వరకు తిరుపతి నియోజకవర్గ ఇంచార్జీగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కొనసాగారు. తాజాగా, ప్రభుత్వం ఆమెను ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్పర్సన్గా నియమించారు. అప్పటి నుంచి అక్కడ పార్టీ కేడర్ను నడిపించే నాయకులు లేకుండాపోయారు. ఈ క్రమంలోనే మన్నెం శ్రీనివాస ప్రసాద్ నియోజకవర్గంలో బాగా యాక్టివ్ అయ్యారు. కొంతకాలంగా తిరుపతి నియోజకవర్గంలో టీడీపీ తరఫున బలమైన వాయిస్ వినిపిస్తూ పార్టీ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. దీంతో ఆయనను టీడీపీ అధిష్టానం నియోజకర్గ ఇంచార్జీగా నియమించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV