
తిరుమల, 03 జూలై (హి.స.) కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం టోకెన్లు లేని సామాన్య భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కలగడానికి దాదాపు 12 గంటల వరకు సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి.
క్యూ లైన్ నారాయణగిరి షెడ్ల వరకు కొనసాగుతోంది. ఓ వైపు వేసవి సెలవులు ముగిసినప్పటికీ వీకెండ్స్ ప్రభావం, సాధారణ రోజుల్లో సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఈ రద్దీ నెలకొంది. లడ్డూ ప్రసాదం కౌంటర్లు, కళ్యాణకట్టల వద్ద కూడా భక్తుల సందడి కనిపిస్తోంది.
గడిచిన 24 గంటల్లో స్వామివారిని 66,304 మంది భక్తులు దర్శించుకున్నారు. అదేవిధంగా 31,811 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. నిన్న ఒక్కరోజే హుండీ ఆదాయం 4.51 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. సర్వదర్శనం కంపార్టుమెంట్లు నిండిపోవడంతో క్యూలైన్లలో ఉన్న చిన్నపిల్లలు, వృద్ధులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ నిరంతరాయంగా పాలు, తాగునీరు, అన్నప్రసాదాలను పంపిణీ చేస్తోంది. టోకెన్లు లేకుండా నేరుగా తిరుమలకు వచ్చే భక్తులు వేచి ఉండే సమయాన్ని దృష్టిలో ఉంచుకుని అందుకు తగ్గట్లుగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV