
గువహాటి:, 31 జూలై (హి.స.)
అసోం రాష్ట్రంలో వరద పరిస్థితి రోజురోజుకూ అత్యంత ఆందోళనకరంగా మారుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు బ్రహ్మపుత్ర మరియు దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో రాష్ట్రం పూర్తిగా జలమయమైంది. ఈ రోజు ఉదయానికి అందిన అధికారిక లెక్కల ప్రకారం వరదల ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 78కి చేరుకుంది.రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సుమారు 3 లక్షల కంటే ఎక్కువ మంది ప్రజలు ఇళ్లను కోల్పోయి, వరద గుప్పిట్లో చిక్కుకుని అల్లాడుతున్నారు. వందలాది గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోగా, వేలాది హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. బాధితుల కోసం ప్రభుత్వం వందలాది పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు బోట్ల సహాయంతో ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. అయితే అసోం ప్రజలకు తక్షణమే ఉపశమనం లభించేలా కనిపించడం లేదు. రేపటి వరకు (ఆగస్టు 1) రాష్ట్రంలో మరిన్ని భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi