
థానే, 31 జూలై (హి.స.): మహారాష్ట్రలోని భివండిలో గురువారం అర్థ రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ ఓ భవనం కూలిపోయి ఏడుగురు మృతిచెందగా, పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. భివండిలోని బాలాజీ నగర్ ప్రాంతంలో నాలుగు అంతస్తుల కోహినూర్ భవనం ఉంది. ఆ బిల్డింగ్‌లో ఒక్కో అంతస్తులో 12 గదుల చొప్పున మొత్తం 48 గదులు ఉన్నాయి. పాత భవనం కావడంతో పౌరసంఘం ఇప్పటికే దానిని నివాసయోగ్యం కానిదిగా ప్రకటించింది.
అయితే, భవన యజమాని మాత్రం పౌరసంఘం హెచ్చరికలను పట్టించుకోకుండా మరమ్మతు పనులు చేపట్టాడు. ఈ క్రమంలో గత రాత్రి సుమారు 9 గంటలకు పెద్ద శబ్దంతో భవనానికి పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. ప్రమాదం జరుగుతుందని భావించిన వారంతా భవనాన్ని ఖాళీ చేసేందుకు సిద్ధమయ్యారు. కొంత మంది అప్పటికే ఖాళీ చేసి వెళ్లిపోగా.. మరికొందరు ఇంటి సామగ్రితో బయటకు వస్తున్నారు. అదే సమయంలో రాత్రి సరిగ్గా 11:30 గంటలకు భవనంలోని బి బ్లాక్ కూలిపోయింది. దీంతో అక్కడికక్కడే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు.
సమాచారం అందిన వెంటనే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), థానే విపత్తు ప్రతిస్పందన దళం, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్, ఫైర్ ఇంజిన్లు, అంబులెన్సులు, భారీగా మట్టిని తొలగించే యంత్రాలను మోహరించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు, మృతుల కుటుంబాల రోదనలతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV