
విశాఖపట్నం,, 05 జూలై (హి.స.)
విశాఖ తీరంలో తీవ్ర కలకలం రేగింది. వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. జూలై 1వ తేదీ తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి IND-AP-MM-V5-83 నంబర్ గల బోటులో వీరంతా సముద్రంలోకి వేటకు వెళ్లారు. అయితే, సముద్రంలో ఒక్కసారిగా మారడంతో వారు తిరిగి హార్బర్కు వచ్చేందుకు నిర్ణయించుకున్నారు. జులై 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో మత్స్యకారులు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, మధ్యాహ్నం 3 గంటల కల్లా విశాఖ ఫిషింగ్ హార్బర్కు చేరుకుంటామని చెప్పారు. కానీ, సాయంత్రం 5 గంటలు దాటినా బోటు హార్బర్కు రాకపోవడంతో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం వారి వద్ద ఉన్న ఆరు మొబైల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తుండటంతో, కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
గల్లంతైన వారిలో ఆరుగురు విజయనగరం జిల్లా, భోగాపురం మండలం, ముక్కాం గ్రామానికి చెందినవారు కాగా, మరొకరు విశాఖపట్నం జిల్లా, భీమిలి మండలం, పెద నాగమయ్య పాలేనికి చెందిన మత్స్యకారుడు. ప్రస్తుతం వీరి కుటుంబాలన్నీ విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ సమీపంలో ఉన్న జాలారిపేట జబ్బర్ తోట ప్రాంతంలో నివాసం ఉంటున్నాయి. ఈ ప్రమాద సమాచారాన్ని బోటు ఓనర్స్ ప్రెసిడెంట్ వాసుపల్లి జానకిరామ్ వెంటనే జిల్లా కలెక్టర్, కోస్ట్ గార్డ్, మత్స్యశాఖ అధికారులు, విశాఖ మెరైన్ పోలీసులకు చేరవేశారు. గల్లంతైన మత్స్యకారుల కోసం వెంటనే భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ