
నెల్లూరు జిల్లా, 05 జూలై (హి.స.)
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 62 ఆలయాల్లో నిత్యాన్నదానం చేస్తున్నామని ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 6200 ఆలయాల్లో ధూప, దీప నైవేద్యం కింద నెలకు రూ.10 వేలు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు (ఆదివారం) నెల్లూరు జిల్లా చేజర్లలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విస్తృతంగా పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెరుమూళ్ల పాడులోని నాగలింగేశ్వరస్వామి ఆలయం, చేజర్లలోని చెన్నకేశవ స్వామి ఆలయం, చిత్తలూరు గ్రామంలోని చెన్నకేశవ ఆలయాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడారు.
పురాతన ఆలయాలను పున:నిర్మించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని మంత్రి ఆనం వ్యాఖ్యానించారు. ఎన్నికల సందర్బంగా తాము చెప్పినవి అన్నిచేశామని తెలిపారు. గతంతో పోలిస్తే ఆలయాల్లో గణనీయంగా భక్తుల సంఖ్య పెరిగిందని వివరించారు. నెలకు 24 లక్షల మందికి దేవాలయాల్లో అన్నదానం ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నాయని చెప్పుకొచ్చారు. గోదావరి నది ఒడ్డున రూ.500కోట్లతో ఆలయాలకు మరమ్మతులు చేస్తున్నామని తెలిపారు. ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్గా చేయడం సీఎం చంద్రబాబు సంకల్పమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ