
హైదరాబాద్, 05 జూలై (హి.స.)
: భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ రైలు ట్రయల్స్ తుది దశకు చేరుకున్నాయి. రానున్న 10 నుంచి 12 రోజుల్లో అన్ని పరీక్షలు పూర్తయ్యే అవకాశం ఉందని రైల్వే వర్గాలు వెల్లడించాయి. అనంతరం రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్‌వో) నుంచి తుది అనుమతి లభిస్తే, సాధారణ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.
భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభానికి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. దిల్లీ డివిజన్ 'డివిజనల్ రైల్వే మేనేజర్' (డీఆర్ఎం) పుష్పేశ్ త్రిపాఠి, రైల్వే పరిపాలనా అధికారులతో కలిసి ప్రత్యేక రైలులో జింద్ జంక్షన్‌కు చేరుకుని ఏర్పాట్లను సమీక్షించారు. స్టేషన్ ప్రాంగణంతో పాటు హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం, స్టేడియంలోని హెలిప్యాడ్‌ను కూడా ఆయన తనిఖీ చేశారు. రైలు ప్రారంభోత్సవానికి ముందు అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలని అధికారులకు పలు సూచనలు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రత, సాంకేతిక ప్రమాణాలు, స్టేషన్ మౌలిక సదుపాయాలు, హైడ్రోజన్ ఇంధన సరఫరా వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా హైడ్రోజన్ రైలు ట్రయల్స్ ఉన్నత దశలో ఉన్నాయని డీఆర్ఎం పుష్పేశ్ త్రిపాఠి తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi