
హుజూర్నగర్, 05 జూలై (హి.స.)
శాంతిభద్రతల పరిరక్షణ నేరాల నియంత్రణే పోలీసుల ప్రధాన లక్ష్యమని కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో డీఎస్పీ, హుజూర్ నగర్ సీఐ చరమందరాజు ఆధ్వర్యంలో ఆదివారం తెల్లవారుజామున భారీ కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, అనుమానిత వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు మరియు నేరాలను అరికట్టేందుకు ఈ కార్డెన్ సెర్చ్ చేపట్టినట్లు వెల్లడించారు. వాహనదారులు తప్పనిసరిగా తమ వాహనాలకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అర్ధరాత్రి తర్వాత అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులపై నిఘా పెట్టామని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ చరమందరాజు హెచ్చరించారు. హుజూర్నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో సుమారు 100 మంది పోలీసు సిబ్బందితో కాలనీని చుట్టుముట్టి ప్రతి ఇంటిని చుట్టుముట్టడంతో పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ తనిఖీలో సరైన రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ లేని 51 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇందులో 42 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలు, ఒకటి టాటా ఏస్ ఆటో మొత్తం 51 వాహనాలు సీజ్ చేసినట్లు డిఎస్పీ తెలిపారు. తనిఖీల సందర్భంగా అనుమానితుల వివరాలు సేకరించి, రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై ఆరా తీశామన్నారు. కాగా తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు కొనసాగించారు. ఇకపై హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో ఇటువంటి
తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. తమ వాహనాలకు సంబంధించిన అన్ని ఒరిజినల్ పత్రాలు పోలీసులకు చూపిస్తే సీజ్ చేసిన వాహనాలను అప్పగిస్తామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు