
హైదరాబాద్, 05 జూలై (హి.స.)
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ
పరిధిలోని నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ మేరకు ఆదివారం అయోధ్య నగర్,సీతారాం బాగ్, ఆసిఫ్ నగర్ లోని పలు బస్తీలను సందర్శించిన ఆయన, వివిధ పార్కులలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్స్ ను ప్రారంభించారు. అలాగే న్యూ ఇందిరానగర్ లో బద్ది పోచమ్మ, బంగారు మైసమ్మ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించిన కేంద్రమంత్రి, అక్కడి నల్ల పోచమ్మ ఆలయ ప్రాంగణంలో నూతన వ్యాయామశాల (జిమ్), నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందిస్తానని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇందిరానగర్ లో ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన మేరకు ఈ ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ మానవ వనరులుగా తోడ్పడాలని పిలుపునిచ్చారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ జీహెచ్ఎంసీ పరిధిలో ట్రీ ప్లాంటేషన్, వర్షపు నీటి కాలువలు, పైప్లాన్లలో పూడికతీత పనులు ఎక్కడా జరగడం లేదని మండిపడ్డారు. చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ రోడ్లు చెరువులుగా మారి ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం హైదరాబాద్ను లండన్, సింగపూర్ చేస్తామని గొప్పలు చెప్పడమే తప్ప.. గత మూడేళ్లుగా క్షేత్రస్థాయిలో ఎలాంటి పనులు చేయలేదని విమర్శించారు. ఈ ఏడాది జూన్ నెలలో దేశంలో, ముఖ్యంగా హైదరాబాద్లో సాధారణం కంటే 40 నుండి 50 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్గా మారి వేడి విపరీతంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షపు నీరు మూసీ నది ద్వారా వృథాగా సముద్రంలో కలవకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఇంట్లో, ప్రతి పార్కులో వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ (ఇంగుడు గుంతలు) ఏర్పాటు చేసి పర్యావరణాన్ని కాపాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..