అదానీ గ్రూప్ భారీ ఆసుపత్రి.. 1,000 బెడ్లు పేదలకు ఉచితం
అదానీ గ్రూప్ భారీ ఆసుపత్రి.. 1,000 బెడ్లు పేదలకు ఉచితం
adani


కోల్‌కతా, 05 జూలై (హి.స.)

పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ ఆరోగ్య రంగంలో మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా సమీపంలోని న్యూ టౌన్ ప్రాంతంలో 2,000 పడకల సామర్థ్యంతో ఒక అత్యాధునిక ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారి వెల్లడించారు. ఇందులో సగం పడకలను అంటే 1,000 బెడ్లను పేద రోగులకు పూర్తిగా ఉచితంగా కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు.

గత శనివారం తన నియోజకవర్గం భవానీపూర్‌లో పౌర సమాజ ప్రతినిధులతో జరిగిన ఒక సమావేశంలో సీఎం సువేందు అధికారి మాట్లాడారు. తమ ప్రభుత్వం గత రెండు నెలల్లో చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ, అదానీ గ్రూప్ ఆసుపత్రి ఏర్పాటుకు లిఖితపూర్వక హామీ ఇచ్చిందని స్పష్టం చేశారు. ఈ ఆసుపత్రిలో 1,000 పడకలను పేదల ఉచిత వైద్యానికి, మిగిలిన 1,000 పడకలను వాణిజ్య కార్యకలాపాలకు వినియోగిస్తారని ఆయన వివరించారు.

అదానీ గ్రూప్ సామాజిక బాధ్యతలో (సీఎస్ఆర్‌) భాగంగా దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో పలు కార్యక్రమాలు చేపడుతోంది. గతంలో బీహార్‌లో అఖండ జ్యోతి ఆసుపత్రితో కలిసి 'అదానీ సెంటర్ ఫర్ ఐ డిసీజెస్'ను ప్రారంభించింది. ఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీలో కిడ్నీ సంబంధిత వ్యాధుల చికిత్స ప్రాజెక్టును కూడా విస్తరించింది.

ఈ సందర్భంగా అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. ఒక వ్యక్తికి కంటిచూపు ఇవ్వడమంటే కేవలం వైద్యం అందించడం కాదు, వారి జీవితంలోకి ఆశ, ఆత్మవిశ్వాసం, గౌరవాన్ని తిరిగి తీసుకురావడం అని అన్నారు. కోల్‌కతాలో ఏర్పాటు చేయనున్న ఈ కొత్త ఆసుపత్రి, అదానీ గ్రూప్ ఆరోగ్య సేవల విస్తరణలో ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలవనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande