అయోధ్య రామమందిర విరాళాల కేసులో దోషులకు కఠిన శిక్ష పడాలి: మోహన్ భాగవత్
అయోధ్య రామమందిర విరాళాల కేసులో దోషులకు కఠిన శిక్ష పడాలి: మోహన్ భాగవత్
Sarsangachalak Mohan Bhagwat


నాగపూర్, 05 జూలై (హి.స.)

అయోధ్య రామ మందిర విరాశాల అవకతవకలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్​ (ఆర్​ఎస్​ఎస్​) అధినేత ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన తీవ్రంగా ఖండించదగినదని, దోషులను కఠినంగా శిక్షించాలని ఈ సంస్థ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే చేసిన ప్రకటననే ఆయన బలపరిచారు. ఇంతకు మించి అదనపు వ్యాఖ్యలు చేయడానికి ఆయన నిరాకరించారు. నాగపూర్ లో జరిగిన 'సన్మార్గ్​ మైండ్ వెల్నెస్​' ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఆయన, ఒక రోజు క్రితం ఆర్​ఎస్​ఎస్​ విడుదల చేసిన అధికారిక ప్రకటనను చూడాలని కోరారు.

శుక్రవారం హోసబలే మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తరాల పోరాటాలు, కోట్ల మంది రామభక్తుల అంకిత భావం, త్యాగం, బలిదానాల వల్ల శ్రీరామ జన్మభూమిపై నిర్మించిన ఈ అద్భుత ఆలయం యావత్​ హిందూ సమాజానికి భక్తి, శ్రద్ధ, విశ్వాసాలకు కేంద్రంగా మారింది. అయితే ఈ ఆయోధ్య రామమందిరంలో ఉంచిన విరాళాల దొంగతనం ఒక దురదృష్టకర ఘటన. ఇది మొత్తం సమాజం, రామభక్తుల మనోభావాలను, భక్తిని గాయపరిచింది. మనందరినీ ఎంతగానో గాయపరిచింది. ఇది తీవ్రంగా ఖండించదగినది. కనుక దర్యాప్తులో దోషులుగా తేలిన ఎవరికైనా కఠినమైన శిక్ష పడేలా చూడడం అత్యవసరం అని అన్నారు.

బీజేపీపై కాంగ్రెస్ ఫైర్​

మరోవైపు అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసు రాజకీయంగా మరింత వేడెక్కుతోంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ తాజాగా బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. మరోవైపు విశ్వ హిందూ పరిషత్ (VHP) ప్రతిపక్ష నేతలు చేసిన ఆరోపణలపైనా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. దీంతో ఈ కేసు రాజకీయంగా కొత్త మలుపు తిరిగింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆదివారం రోజు మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ రాజకీయ వ్యూహం ఇప్పుడు 'ఓటు చోరీ, సీటు చోరీ, చందా చోరీ' గా మారిందని విమర్శించారు. అయోధ్య రామ మందిరం కోసం భక్తులు సమర్పించిన వేల కోట్ల రూపాయల విరాళాల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటివరకు స్పందించకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు.

రామ మందిరం నిర్మాణానికి రాజకీయంగా క్రెడిట్ తీసుకున్న నాయకులు ఇప్పుడు ఈ ఆరోపణలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని జైరాం రమేశ్ ప్రశ్నించారు. ' రామ మందిరం నిర్మాణం, అలాగే 2024 జనవరి 22న రామ మందిరం ప్రారంభోత్సవ ఘనతను తమ ఖాతాలో వేసుకున్న ప్రధాన మంత్రి- ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్యను కోల్పోయినప్పటికీ- దీనిపై ఏదైనా ప్రకటన చేస్తారని మేం ఆశిస్తున్నాం. కానీ వారు పూర్తిగా మౌనంగానే ఉన్నారు.' అని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. ఈ కేసును సిట్టింగ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని, నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ 'చందా దో.. ధందా లో' అనే విధానమే బీజేపీ రాజకీయ సంస్కృతిలో భాగమని ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని సుప్రీం కోర్టు రద్దు చేసిందని, విరాళాల రాజకీయాలు బీజేపీ డీఎన్‌ఏలో భాగమని ఆయన ఆరోపించారు.

అన్ని కోణాల్లో సిట్ విచారణ

ఈ కేసులో యూపీ సర్కార్ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను కొనసాగిస్తోంది. సిట్ ప్రాథమిక నివేదిక ఆధారంగా జూన్ 25న ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఆరుగురి వద్ద నుంచి సుమారు రూ. 80 లక్షల వరకు నగదు, కొంత విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, మాజీ ట్రస్టీ అనిల్ మిశ్రా ఇప్పటికే తమ పదవులకు రాజీనామాలు చేశారు. కేసుపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది.

ఇదిలా ఉండగా, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు మహంత్ దినేంద్ర దాస్ మహారాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి దోషులెవరైనా కఠినంగా శిక్షించాలని అన్నారు. రామ మందిరం విరాళాల దుర్వినియోగం అత్యంత తీవ్రమైన నేరమని పేర్కొన్న ఆయన, ఆలయంలో పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయన్నారు. విరాళాల నిర్వహణలో పారదర్శకతను మరింత బలోపేతం చేశామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, రాజకీయ ఆరోపణలు- ప్రత్యారోపణలు మరింత వేడెక్కుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande