
అమరావతి, 05 జూలై (హి.స.)
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో పలువురు అధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. మొత్తం 12 మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) స్థాయి అధికారులకు అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (అదనపు ఎస్పీ) మరియు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) హోదాలకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ శనివారం ఉత్తర్వులు వెలువరించారు. వీరిలో సివిల్ విభాగానికి చెందిన 9 మంది డీఎస్పీలకు, ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్) విభాగానికి చెందిన ముగ్గురు డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి లభించింది.
సివిల్ విభాగంలో పదోన్నతి పొందిన వారిలో ఎం. రాజగోపాల్ రెడ్డి, పి. శ్రీకాంత్, టి. శ్రీనివాసులు, జి. శివభాస్కర్ రెడ్డి, డి. సోమన్న, ఏ.ఎస్. చక్రవర్తి, ఎం. అంబికా ప్రసాద్, ఎస్. వాసుదేవ్, ఎ. నరసింహమూర్తి ఉన్నారు. ఏఆర్ విభాగం నుంచి బి. చంద్రశేఖర్, ఎల్. శేషాద్రి, వై. రవీందర్ రెడ్డి అదనపు ఎస్పీలుగా పదోన్నతి పొందారు.
అలాగే, ఏఆర్ విభాగంలో అదనపు ఎస్పీలుగా ఉన్న ముగ్గురు అధికారులకు ఎస్పీ హోదా కల్పిస్తూ పోస్టింగులను ఖరారు చేశారు. ఎ. హనుమంతును కర్నూలు హోంగార్డ్స్ కమాండెంట్‌గా, బి. సత్యనారాయణను విజయవాడ సిటీ సెక్యూరిటీ వింగ్ డీసీపీగా, ఎం. మహేశ్ కుమార్‌ను తిరుపతి పీటీసీ ప్రిన్సిపాల్‌గా నియమించారు. పదోన్నతి పొందిన మిగిలిన అధికారులు తదుపరి పోస్టింగుల నిమిత్తం డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi