
అమరావతి, 06 జూలై (హి.స.)
బీసీ సంక్షేమానికి తొలి మూడు బడ్జెట్లలో వరుసగా రూ.39 వేల కోట్లు, రూ.47 వేల కోట్లు, రూ.51 వేల కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించిందని మంత్రి సవిత తెలిపారు. ఈరోజు(సోమవారం) మీడియాతో మాట్లాడుతూ.. మూడో బడ్జెట్లో బీసీల సంక్షేమం కోసం రికార్డు స్థాయిలో రూ.51 వేల కోట్లు కేటాయించామన్నారు. రూ.500 కోట్ల సాస్కి నిధులతో ఎంజేపీ గురుకులాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 109 గురుకులాలకు అదనంగా మరో 10 కొత్త బీసీ గురుకులాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బీసీ విద్యార్థులకు నీట్, ఐఐటీ ప్రవేశాల కోసం టేకులోడు, సింహాచలంలో రెండు ఎక్స్లెన్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు
ఆరు బాలికల గురుకులాలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేస్తూ ఉన్నత విద్యకు అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రూ.26.71 కోట్లతో 62 ఎంజేపీ గురుకుల భవనాల మరమ్మతులు చేపడుతున్నట్లు చెప్పారు. గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం, క్రీడా సామగ్రి, ట్రాక్సూట్లను అందజేస్తున్నామన్నారు. చెస్లో ప్రతిభ పెంపొందించేందుకు ఏపీ చెస్ అకాడమీతో ఎంవోయూ కుదుర్చుకున్నామని తెలిపారు. 998 బీసీ హాస్టళ్లలో 85 వేల మంది విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు.
రెండేళ్లలో రూ.80 కోట్లతో బీసీ హాస్టళ్ల మరమ్మతులు, మౌలిక వసతులను అభివృద్ధి చేశామని మంత్రి తెలిపారు. 772 హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు, 642 హాస్టళ్లలో ఇన్వర్టర్లను ఏర్పాటు చేశామన్నారు. సివిల్స్, డీఎస్సీ, గ్రూప్-1, గ్రూప్-2 పోటీ పరీక్షలకు బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. విశాఖపట్నం, అనంతపురం, తిరుపతిలో మూడు ప్రత్యేక బీసీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రూ.1000 కోట్లతో ఆదరణ-3.0 అమలు చేసి బీసీలకు ఆధునిక పరికరాలను పంపిణీ చేస్తామన్నారు.
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ