వీఐపీ బ్రేక్ దర్శనంలో 116 ఏళ్ల నవనీతమ్మ.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న టీటీడీ
వీఐపీ బ్రేక్ దర్శనంలో 116 ఏళ్ల నవనీతమ్మ.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న టీటీడీ
116 ఏళ్ల భక్తురాలికి శ్రీవారి ప్రత్యేక దర్శనం


తిరుమల, 06 జూలై (హి.స.) 116 ఏళ్ల వయసులోనూ అచంచల భక్తితో కాలినడకన తిరుమలకు చేరుకున్న వృద్ధ భక్తురాలికి టీటీడీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆమెకు ఈ రోజు సోమవారం ఉదయం శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించింది.

టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు తన కోటాలో ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయించడంతో భక్తురాలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనకు ఈ వయసులో శ్రీవారి ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించిన టీటీడీ ఛైర్మన్కు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. స్వామివారి దర్శనం జీవితంలో మరపురాని అనుభూతిగా నిలిచిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో వైరల్

తాజాగా 116 ఏళ్ల ఈ వృద్ధ భక్తురాలు కుటుంబ సభ్యుల సహాయంతో అలిపిరి మార్గంలో కాలినడకన తిరుమలకు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు ఆమెకు ప్రత్యేక దర్శనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. హామీ మేరకు అధికారులు భక్తురాలి వివరాలు సేకరించి, సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేశారు. అధికారులు ఆమెను తమిళనాడుకు చెందిన నవనీతమ్మగా గుర్తించారు. 116 ఏళ్ల వయసులోనూ ఆమె ప్రదర్శించిన భక్తి, సంకల్పం పలువురిని భావోద్వేగానికి గురిచేయగా, టీటీడీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం భక్తుల ప్రశంసలను అందుకుంది.

మా అమ్మమ్మ కోరికను నెరవేర్చి..

ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు ఎక్స్ వేదికగా వివరాలు వెల్లడించారు. ఈ రోజు 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు నవనీతమ్మ గారికి, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ప్రత్యేక వీఐపీ బ్రేక్ దర్శనం విజయవంతంగా కల్పించామని పేర్కొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర వేదపండితులతో వేదాశీర్వచనం చేయించి, పట్టు వస్త్రం కప్పి, తీర్థప్రసాదాలు అందజేశారు. నవనీతమ్మకి నమస్కరించి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా నవనీతమ్మ మనవడు దిక్పతి మాట్లాడుతూ, “మా అమ్మమ్మ కోరికను నెరవేర్చి, మా కుటుంబ సభ్యులందరికీ శ్రీవారి దర్శన భాగ్యం కల్పించిన టీటీడీకి, టీటీడీ చైర్మన్కి హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande