
నల్గొండ, 06 జూలై (హి.స.)
నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన బీఎల్ఎలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల అవగాహన సదస్సుకు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత హాజరై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్ఐఆర్ (SIR) ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బీఎల్ఎలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చురుకుగా పాల్గొని, ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఓటరు పేరు సక్రమంగా ఉండేలా కృషి చేయాలని సూచించారు. బీఎల్దలతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ, ప్రతి బూత్లోని ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులైన ఏ ఓటరు పేరు కూడా అనవసరంగా తొలగిపోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనది. ఓటర్ల హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ బూత్ పరిధిలోని పార్టీ మద్దతుదారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ, వారి ఓటరు వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించారు. బూత్ స్థాయిలో పటిష్టమైన వ్యవస్థను నిర్మించి, ప్రతి ఓటరుని చైతన్యపరిస్తేనే పార్టీ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు