క్యాతనపల్లి మున్సిపాలిటీలో మంత్రి వివేక్ మార్నింగ్ వాక్..
క్యాతనపల్లి మున్సిపాలిటీలో మంత్రి వివేక్ మార్నింగ్ వాక్..
Minister


మంచిర్యాల, 06 జూలై (హి.స.) మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర కార్మిక, ఉపాధి గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సోమవారం ఉదయం స్థానిక నాయకులతో కలిసి మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గతంలో ఇచ్చిన హామీల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మంత్రి వివేక్ మాట్లాడుతూ 9వ వార్డులోనే రూ.4.80 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రాబోయే మూడు నెలల్లో ఈ పనులు వంద శాతం పూర్తవుతాయని భరోసా ఇచ్చారు. గత పాలకుల నిర్లక్ష్యం, బిల్డర్ల బాధ్యతారాహిత్యం కారణంగా కాలనీల్లో రోడ్లు, డ్రైన్లు సరిగా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాతనపల్లి మున్సిపాలిటీ పై ప్రత్యేక దృష్టి సారించి సుమారు రూ.80 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిందని తెలిపారు.

ఈ ఏడాది అమృత్ పథకం కింద రూ.40 కోట్లతో తాగునీటి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, డిసెంబరు నాటికి ప్రతి ఇంటికీ నల్లా ద్వారా తాగునీరు అందించే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని పేర్కొన్నారు. కన్నెపల్లి పంప్ హౌసన్ను సందర్శించిన బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ వ్యాఖ్యల పై స్పందించిన మంత్రి, 60 వేల మందితో ముట్టడి చేసి పంపులు నడుపుతామనడం అవగాహన లేమికి నిదర్శనమని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్ని టీఎంసీల నీటిని వినియోగించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande