
సంగారెడ్డి, 06 జూలై (హి.స.)
కేంద్ర ఎన్నికల సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐర్) అంశంలో ఓటర్లకు అవగాహన కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారని.. అర్హులైన ఓటరు తమ ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున నియమించబడిన బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండి.. అర్హులైన ప్రతి ఓటు ఎస్ఐఆర్ లో నమోదు చేయించాలని ఆయన సూచించారు. ఎస్ఐఆర్, బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్ అంశాలపై బిఎల్ఎలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 12 న పటాన్ చెరు లోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్య అతిథిగా అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మినీ ఇండియా గా పేరుందిన పటాన్ చెరు నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై ఓటర్లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించకపోవడం మూలంగా ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
దేశంలోని 28 రాష్ట్రాల ప్రజలు నియోజకవర్గంలో నివాసం ఏర్పరచుకొని తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారని.. వీరి ఓటు హక్కు అంశం ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నియమించిన బూత్ లెవెల్ అధికారులు క్షేత్రస్థాయిలో ఆశించిన మేరకు పనిచేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తరపున నియమించబడిన బూతు లెవల్ ఏజెంట్లు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రతి ఓటు కీలకంగా భావించి, ఓటరుకి ఎస్ఐఆర్ పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి.. వారి వివరాలు నమోదు చేయించుకునేలా కృషి చేయాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఐఆర్ పేరుతో బీఆర్ఎస్ ఓట్లను తొలగించాలన్న కుట్రతో పనిచేస్తున్నాయని ఆరోపించారు.
పటాన్ చెరు నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తొమ్మిది డివిజన్లో ఉన్నాయని.. రాబోయే బల్దియా ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయాలంటే ప్రతి ఓటును రక్షించుకోవాల్సిన ఆవశ్యకత కార్యకర్తలపై ఉందని తెలిపారు.. రెండు చోట్ల ఓటు కలిగిన ఓటర్లకు స్థానికంగానే ఓటు ఉంచుకునేలా సూచించాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..