
హైదరాబాద్, 06 జూలై (హి.స.)రాష్ట్రంలో కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సుల పన్ను విధానంలో కీలక మార్పులకు రవాణాశాఖ రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఒక జిల్లా, రెండు జిల్లాల పరిధి, రాష్ట్ర స్థాయి.. ఈ మూడు రకాల పన్ను విధానాల్ని రద్దు చేసి, అన్ని బస్సుల్లోని సీట్లకు ఒకే రకమైన త్రైమాసిక పన్ను విధించేలా అధ్యయనం చేస్తోంది. ‘ఒకే రాష్ట్రం ఒకే పన్ను విధానం’ తీసుకువచ్చే దిశగా కార్యాచరణ ముందుకు తీసుకెళుతోంది.
రాష్ట్రంలో 6,641 ప్రైవేటు బస్సులు కాంట్రాక్ట్ క్యారేజ్ సర్వీసులుగా తిరుతున్నాయి. ఇందులో సాధారణ ప్రయాణికుల కోసం ఆపరేటర్లు నడిపేవాటితో పాటు ప్రైవేటు కంపెనీలు తమ ఉద్యోగుల కోసం నడిపేవీ ఉన్నాయి. ప్రస్తుత విధానంతో సీటుకు కనిష్ఠంగా రూ.1,120.. గరిష్ఠంగా రూ.3,285 వసూలు చేస్తుండటంతో ప్రతి మూడు నెలలకు రూ.117.83 కోట్ల ఆదాయం వస్తోంది. కొత్త విధానంలో ప్రతి సీటుకు రూ.1,500 లేదా రూ.1,800గా వసూలు చేయాలని రవాణాశాఖ భావిస్తోంది. రూ.1,500గా నిర్ణయిస్తే రూ.142.23 కోట్ల ఆదాయంతో సంవత్సరానికి దాదాపు రూ.వంద కోట్లు అదనంగా వస్తుంది. రూ.1,800గా నిర్ణయిస్తే రూ.169.71 కోట్ల ఆదాయంతో ఏడాదికి సుమారు రూ.209 కోట్ల అదనపు రాబడి వస్తుంది. ఈ భారం అంతిమంగా ప్రయాణికులపై లేదంటే ఉద్యోగుల కోసం నడిపే యాజమాన్యాలపై పడుతుంది.
ఇప్పుడు రాష్ట్రం అంతటా తిరిగే బస్సులకు సీటుకి రూ.3,285 చొప్పున వసూలు చేస్తున్నారు. వీటికి మాత్రం పన్ను భారం భారీగా తగ్గుతుంది. అయితే వీటి సంఖ్య 108 మాత్రమే. ఒకే జిల్లా పరిధిలో తిరిగేవి ఏకంగా 5,100 ఉన్నాయి. వీటికి త్రైమాసికానికి రూ.1,120 ఉంది. అంటే ఒక జిల్లా పరిధిలో తిరిగినా, రాష్ట్రం అంతా తిరిగినా ఒకే రకంగా పన్ను కట్టాల్సి ఉంటుంది. దీంతో తక్కువ దూరం తిరిగే బస్సుల యజమానులకు కొత్త విధానం భారంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అధ్యయనం మాత్రమే జరుగుతోందని తుది నిర్ణయం తీసుకోలేదని రవాణాశాఖ వర్గాలు చెబుతున్నాయి. నిర్ణయం తీసుకుంటే.. బస్సుల యజమానుల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తామని అధికారులు అంటున్నారు. కొత్త విధానంలో రాష్ట్రం పర్మిట్తో పాటు ఉమ్మడి జిల్లా పర్మిట్ ఆలోచన కూడా ఉందంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్