
హైదరాబాద్, 06 జూలై (హి.స.)
ఒడిశా నుంచి మహారాష్ట్రకు రైలు
మార్గంలో జరుగుతున్న అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ రవాణాను సికింద్రాబాద్ ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ), తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీనాబ్) ఈగిల్ బృందం, రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్) సంయుక్తంగా భగ్నం చేశాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిర్వహించిన తనిఖీల్లో రూ.20.56 లక్షల విలువైన 41.131 కిలోల డ్రై గంజాయి స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో ఇద్దరు యువకులు, ఒక మైనర్ బాలుడు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రైల్వే డీఎస్పీ జావేద్ సోమవారం మీడియాకు వెల్లడించారు. మహారాష్ట్రలోని నాగ్పూర్క చెందిన దిలీప్ వాంధారే (25), కార్తిక్ చంద్రకాంత్ అంబే (30), 17 ఏళ్ల బాలుడిని ఒడిశాలోని బలంగీర్కు చెందిన ప్రధాన నిందితుడు సంజు సాహు గంజాయి రవాణాకు వినియోగించాడు.
ఒక్కో ట్రిప్కు రూ.5 వేల చొప్పున ఇస్తానని ఆశ చూపించి వారితో అక్రమ రవాణా చేయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ నెల 3న బలంగీర్ రైల్వే స్టేషన్లో గంజాయి ప్యాకెట్లను ట్రాలీ, సూట్కేసులు, బ్యాక్ప్యాక్లలో దాచి నిందితులకు అందజేశారు. అనంతరం నాగావళి ఎక్స్ప్రెస్లో చర్లపల్లి చేరుకుని, అక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చి దక్షిణ్ ఎక్స్ప్రెస్ ద్వారా నాగ్పూర్ వెళ్లేందుకు సిద్ధమవుతుండగా నిఘా సమాచారంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల బ్యాగులను తనిఖీ చేయగా చిన్న చిన్న ప్యాకెట్లలో భద్రపరిచిన 41.131 కిలోల డ్రై గంజాయి లభించింది. స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థం విలువ సుమారు రూ.20.56 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు