
న్యూఢిల్లీ, 06 జూలై (హి.స.)
బీహార్, గుజరాత్, మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని మూడు కీలక అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం (ECI) సోమవారం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మూడు స్థానాలకు జూలై 30న పోలింగ్ జరగనుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. బీహార్‌లోని 182-బాంకీపూర్, గుజరాత్‌లోని 145-మంజల్‌పూర్, మరియు మధ్యప్రదేశ్‌లోని 22-దతియా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ ఉపఎన్నికలు జరగనున్నాయి.ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల దాఖలుకు జూలై 13 చివరి తేదీ కాగా, జూలై 14న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు జూలై 16 వరకు గడువు ఇచ్చారు. జూలై 30న ఉదయం 7:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, మొత్తం ఎన్నికల ప్రక్రియను ఆగస్టు 4, 2026 నాటికి పూర్తి చేయాలని ఎన్నికల సంఘం గడువు విధించింది. ఈ స్థానాలు ఖాళీ అవ్వడానికి గల కారణాలను పరిశీలిస్తే.. బీహార్‌లోని బాంకీపూర్ స్థానానికి సిట్టింగ్ సభ్యుడు నితిన్ నబిన్ మార్చి 30, 2026న రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. గుజరాత్‌లోని మంజల్‌పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే యోగేష్‌భాయ్ నారందాస్ పటేల్ జూన్ 2, 2026న మరణించడంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. ఇక మధ్యప్రదేశ్‌లోని దతియా స్థానానికి ప్రాతినిధ్యం వహించిన రాజేంద్ర భారతి ఏప్రిల్ 2, 2026న ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 నిబంధనల ప్రకారం అనర్హతకు గురికావడంతో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi