హైదరాబాద్ విమానాశ్రయంలో సెప్టెంబర్ నుంచి కొత్త ఛార్జీలు?
హైదరాబాద్ విమానాశ్రయంలో సెప్టెంబర్ నుంచి కొత్త ఛార్జీలు?
Air Plane


హైదరాబాద్, 06 జూలై (హి.స.)

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) నుంచి ప్రయాణించే వారితో పాటు, ఇకపై హైదరాబాద్‌కు విమానంలో వచ్చే వారిపై కూడా యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు (యూడీఎఫ్) విధించేందుకు రంగం సిద్ధమవుతోంది. విమానాశ్రయ నిర్వాహక సంస్థ జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్), ఈ మేరకు ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఈఆర్ఏ)కు ప్రతిపాదనలను సమర్పించింది.

ఈ నూతన విధానం ప్రకారం, ప్రస్తుతం కేవలం బయలుదేరే (డిపార్చర్) ప్రయాణికులపైనే విధిస్తున్న యూడీఎఫ్‌ను, ఇకపై డిపార్చర్ మరియు అరైవల్ ప్రయాణికుల మధ్య విభజించనున్నారు. దేశీయ ప్రయాణికులకు డిపార్చర్‌పై రూ. 580, అరైవల్‌పై రూ. 170 చొప్పున ఛార్జీలను ప్రతిపాదించారు. అలాగే, అంతర్జాతీయ ప్రయాణికులకు డిపార్చర్‌పై రూ. 1,150, అరైవల్‌పై రూ. 350 వసూలు చేయాలని నిర్ణయించారు. అయితే, దీనివల్ల ప్రయాణికులపై తక్షణమే భారం పడదు. ఏఈఆర్ఏ ఆమోదం లభిస్తే 2026 సెప్టెంబర్ 1 నుంచి జారీ చేసే టికెట్లపై మాత్రమే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

భవిష్యత్తులో విమానాశ్రయంలో పెరగనున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని భారీ విస్తరణ పనులు చేపట్టాలని జీఎంఆర్ భావిస్తోంది. రానున్న మూడేళ్లలో సుమారు రూ. 13,975 కోట్ల వ్యయంతో నూతన ప్యాసింజర్ టెర్మినల్, అదనపు రన్‌వే వంటి నిర్మాణాలు చేపట్టనుంది. ఈ విస్తరణ పనులకు అవసరమైన నిధుల సమీకరణ కోసమే యూడీఎఫ్ విధానాన్ని కొనసాగించడం అనివార్యమని జీఎంఆర్ తన ప్రతిపాదనలో పేర్కొంది. అయితే, 2030-31 నాటికి ఈ ఛార్జీలను తగ్గించే అవకాశం ఉందని కూడా వెల్లడించింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఏఈఆర్ఏ పరిశీలనలో ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande