
న్యూఢిల్లీ, 06 జూలై (హి.స.)
భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ముఖర్జీ జీవితం, దార్శనికత, మరియు దేశానికి ఆయన చేసిన సేవలను స్మరిస్తూ ప్రధాని మోదీ ఒక ప్రత్యేక వ్యాసాన్ని (Op-Ed) రాశారు. ఈ వ్యాసాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోమవారం పంచుకున్నారు. భారతదేశ ఐక్యత, ప్రగతికి అంకితమైన జీవితం అనే శీర్షికతో సాగిన ఈ వ్యాసంలో.. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటమే ముఖర్జీ జీవితం యొక్క ప్రధాన ఆశయమని ప్రధాని పేర్కొన్నారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్‌ను భారతదేశంలో అంతర్భాగంగా ఉంచడంలో మరియు జమ్మూ కాశ్మీర్ విలీన పోరాటంలో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన చేసిన సుప్రీం త్యాగానికి గుర్తింపుగానే ఆర్టికల్ 370, 35(A) రద్దు సాధ్యమైందని మోదీ స్పష్టం చేశారు.కలకత్తా విశ్వవిద్యాలయానికి అతి పిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్‌గా విద్యా రంగాన్ని ఆధునీకరించడంలో, అలాగే స్వతంత్ర భారత పారిశ్రామిక అభివృద్ధికి పునాది వేయడంలో ముఖర్జీ పాత్ర మరువలేనిదని ప్రధాని వివరించారు. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, సింద్రీ ఫెర్టిలైజర్ ప్లాంట్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ఆయనే మూలస్తంభమని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య విలువలపై నమ్మకంతో నెహ్రూ కేబినెట్ నుండి తప్పుకున్న ముఖర్జీ, హ్యాండ్లూమ్ మరియు కుటీర పరిశ్రమలను ఎంతగానో ప్రోత్సహించారన్నారు. 1943 బెంగాల్ కరువు సమయంలో ఆయన చేసిన మానవతా సేవలను కూడా ప్రధాని స్మరించుకున్నారు. ఏ పని చేసినా పూర్తి నిబద్ధతతో చేయాలనే ముఖర్జీ సందేశాన్ని యువత ముందుకు తీసుకెళ్లాలని, 'వికసిత్ భారత్' సాధనే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi