జులైలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ. 2.11 లక్షల కోట్లు
జులైలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ. 2.11 లక్షల కోట్లు
GST


హైదరాబాద్, 01 ఆగస్టు (హి.స.)

దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను (GST)

వసూళ్లు భారీగా పెరిగాయి. 2026 జూలై నెలలో స్థూల జీఎస్టీ (Gross GST) వసూళ్లు గత ఏడాదితో పోలిస్తే 15.4 శాతం పెరిగి ఏకంగా రూ.2.11 లక్షల కోట్లకు చేరినట్లు జీఎస్టీ శాఖ వెల్లడించింది. 2025 జులైలో ఈ వసూళ్లు రూ. 1.83 లక్షల కోట్లుగా ఉండేవి. ప్రధానంగా దిగుమతుల ద్వారా వచ్చే పన్ను ఆదాయంలో 28.8 శాతం మేర బలమైన వృద్ధి నమోదు కావడం, అలాగే స్వదేశీ లావాదేవీల వసూళ్లు 10.1 శాతం పెరిగి రూ. 1.45 లక్షల కోట్లకు చేరుకోవడం ఈ రికార్డు వసూళ్లకు ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. రీఫండ్లు పోను నికర జీఎస్టీ ఆదాయం కూడా 15.8 శాతం వృద్ధితో రూ. 1.81 లక్షల కోట్లుగా నమోదైంది.

రాష్ట్రాల వారీగా వసూళ్లను పరిశీలిస్తే.. మహారాష్ట్ర రూ. 32,210 కోట్లు (13% వృద్ధి) సాధించి అగ్ర స్థానంలో నిలవగా, గుజరాత్ రూ. 12,923 కోట్లు (19%), కర్ణాటక రూ. 13,854 కోట్లు (12%) వసూలు చేశాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ 19 శాతం పెరిగి రూ. 5,819 కోట్ల వసూళ్లు సాధించగా, ఆంధ్రప్రదేశ్లో మాత్రం పన్ను వసూళ్లు 5 శాతం మేర తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూలై వరకు మొత్తం స్థూల జీఎస్టీ వసూళ్లు 10.1 శాతం పెరిగి రూ. 8.43 లక్షల కోట్లకు చేరడం దేశంలో కొనసాగుతున్న బలమైన ఆర్థిక వృద్ధికి అద్దం పడుతోందని నిపుణులు పేర్కొంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande