లోన్లు తీసుకున్న వారికి బంపర్ న్యూస్.. ఈఎంఐలపై RBI కొత్త రూల్స్!
లోన్లు తీసుకున్న వారికి బంపర్ న్యూస్.. ఈఎంఐలపై RBI కొత్త రూల్స్!
RBI


హైదరాబాద్, 17 ఆగస్టు (హి.స.)

బ్యాంకులు ఇచ్చే ఫ్లోటింగ్ రేట్ రుణాల (Floating Rate Loans) వడ్డీ రేట్లు, నెలవారీ కంతులు (EMI) నిర్ణయించే విధానంలో మరింత పారదర్శకత తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నూతన నిబంధనల ముసాయిదాను రూపొందించింది. సాధారణ రుణగ్రహీతలపై ఎలాంటి అదనపు భారం పడకుండా, బ్యాంకుల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేసేలా సంచలన ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఈ విధానంలో అత్యంత కీలకమైన బెంచ్మార్క్ (Benchmark) అంటే ఫ్లోటింగ్ రేట్ రుణాలకు వడ్డీ రేటును లెక్కించడానికి ప్రామాణికంగా వాడే ఒక సూచిక. బ్యాంకులు విధించే మొత్తం వడ్డీ రేటు అనేది ఈ బెంచ్మార్క్ రేటు, బ్యాంక్ మార్జిన్ల కలయికగా ఉంటుంది. మార్కెట్ పరిస్థితులను బట్టి బెంచ్మార్క్ రేటు మారినప్పుడు దానికి అనుగుణంగా రుణగ్రహీతల నెలవారీ ఈఎంఐలు, రుణ కాలపరిమితిలో మార్పులు చోటుచేసుకుంటాయి. రుణ ఒప్పందంలో పేర్కొన్న బెంచ్ మార్క్ రేటు ఏ కారణం చేతనైనా నిలిచిపోయినా, రద్దయినా, కస్టమర్పై ఎలాంటి ప్రతికూల ఆర్థిక భారం పడకుండా ఉచితంగా వేరే కొత్త బెంచ్మార్కు లోన్ను మార్చాల్సిన బాధ్యతను బ్యాంకులే వహించాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.

అంతేకాకుండా పాత విధానంలో ఉన్న రుణాలను కొత్త మార్గదర్శకాల పరిధిలోకి మార్చేందుకు ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయకూడదు. మార్కెట్లో వడ్డీ రేట్లు తగ్గినా, పెరిగినా గరిష్టంగా మూడు నెలల రీసెట్ కాల పరిమితులోనే (Reset Period) ప్రభావం కస్టమర్లకు వర్తించేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ ముసాయిదా నిబంధనలకు తుది ఆమోదం లభిస్తే 2027 ఏప్రిల్ 1 నుంచి కొత్త రుణాలు ఇచ్చే బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకు (NBFCs) ఇవి వర్తించనున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న పాత రుణాలను ఈ నూతన విధానంలోకి ఉచితంగా మార్చేందుకు బ్యాంకులకు 2029 ఏప్రిల్ 1 వరకు గడువు ఇవ్వనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande