
న్యూఢిల్లీ, 17 ఆగస్టు (హి.స.)
పీక్ ట్రావెల్ సీజన్ లో విమానఛార్జీలను ఆయా సంస్థలు ఇష్టారాజ్యంగా పెంచడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలను పాటించడంలో విమానయాన సంస్థలు ఫెయిల్ అయితే.. కఠిన చర్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ప్రైవేట్ ఎయిర్ లైన్స్ యథేచ్ఛగా టికెట్ ధరలను పెంచుతున్నాయని దాఖలైన పిటిషన్ ను విచారించిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం.. విమానయాన సంస్థలు నిబంధనలకు కట్టుబడి లేకపోతే.. వారి సర్వీసుల్ని నిలిపివేసేందుకు కూడా వెనుకాడమని వ్యాఖ్యానించింది. పండుగలు, ఇతర సెలవుల సమయంలో ప్రైవేట్ సంస్థలు విపరీతంగా ఛార్జీలు పెంచి వసూలు చేస్తున్నాయని, ప్రభుత్వ అధికారిక మెమోరాండం కూడా అమలు కావడం లేదని సామాజిక కార్యకర్త ఎస్.లక్ష్మీ నారాయణన్ తమ పిటిషన్లో పేర్కొన్నారు.
విమాన ఛార్జీల నియంత్రణకు స్పష్టమైన నిబంధనలు రూపొందించే ప్రక్రియ చివరి దశకు చేరుకుందని, కేంద్రప్రభుత్వం తరఫున హాజరైన అడిషినల్ సొలిసిటర్ జనరల్ అనిల్ కౌశిక్ సుప్రీంకోర్టుకు వెల్లడించారు. ప్రతిపాదిత నిబంధనలతో కూడిన ముసాయిదాను కేంద్రం సీల్డ్ కవర్లో కోర్టుకు అందించగా.. మిగతా ప్రక్రియను పూర్తిచేసేందుకు మూడువారాల సమయం కావాలని కోరింది. అయితే.. ఈ ఏడాది మే నెలలో జరిగిన విచారణలోనే ప్రయాణికులకు రిలీఫ్ ఇచ్చేలా ఛార్జీలు ఉండాలి కానీ.. ఒకేరోజు ఒకే రూట్లో ప్రయాణించే విమానాల టికెట్ల ధరల్లో చాలా తేడాలుండటం ఆందోళనకరమని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. విమాన ఛార్జీల నియంత్రణకు ప్రత్యేక రెగ్యులేటరీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరగా, కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను అంగీకరించిన సర్వోన్నత న్యాయస్థానం మూడు వారాల గడువు ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు