
హైదరాబాద్, 18 ఆగస్టు (హి.స.)
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా శుభేందు అధికారి ప్రభుత్వం విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ స్వల్ప కాలంలోనే సరిహద్దు భద్రత, సామాజిక సంక్షేమ పథకాలు, పారిశ్రామిక పెట్టుబడులే లక్ష్యంగా ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ముళ్లకంచె నిర్మాణానికి వీలుగా సరిహద్దు భద్రతా దళానికి (BSF) సుమారు 767 ఎకరాలకు పైగా భూమిని బదిలీ చేయడం ద్వారా సరిహద్దు భద్రతను పటిష్టం చేశారు. అలాగే దార్జీలింగ్, జల్పాయ్‌గురి పరిధిలో ఎస్‌ఎస్‌బీ, ఐటీబీపీ బలగాల ప్రధాన కార్యాలయాల కోసం వందల ఎకరాల భూమిని కేటాయించారు. గత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకమైన ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharat) ఆరోగ్య బీమాను రాష్ట్రంలో వేగంగా అమలు చేస్తూ పేదలకు ఉచిత కార్పొరేట్ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు.మహిళా సంక్షేమం కోసం గత ప్రభుత్వం అందించిన సాయాన్ని రెట్టింపు చేస్తూ అన్నపూర్ణా యోజన (Annapurna Yojana) ద్వారా అర్హులైన మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ₹3,000 నెలవారీ ఆర్థిక సాయాన్ని జమ చేయడం ప్రారంభించారు. పరిశ్రమల పునరుద్ధరణలో భాగంగా రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా మూతపడిన 16 జూట్ మిల్లులను (చటకల్) తిరిగి ప్రారంభించి వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించారు. పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసేందుకు ₹100 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తలు స్థానిక మున్సిపాలిటీలు లేదా పంచాయతీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా సుమారు ₹4,000 కోట్ల విలువైన అమిత్ మెటాలిక్స్ ప్రాజెక్టు సహా పలు భారీ పెట్టుబడులు బెంగాల్ వైపు అడుగులు వేస్తున్నాయి. 41 పేజీల ప్రగతి నివేదిక (రిపోర్ట్ కార్డ్) ద్వారా ఈ వంద రోజుల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్తున్న శుభేందు ప్రభుత్వం, రాబోయే రోజుల్లో ఉపాధి కల్పన మరియు శాంతిభద్రతల పరిరక్షణను తమ ప్రధాన లక్ష్యాలుగా ప్రకటించింది.
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi