
న్యూఢిల్లీ/సింగపూర్, 19 ఆగస్టు (హి.స.)
: భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఈరోజు ఉదయం సింగపూర్ చేరుకుంది. 4వ ఇండియా-సింగపూర్ మినిస్టీరియల్ రౌండ్‌టేబుల్ (ISMR) సదస్సులో పాల్గొనేందుకు ఆమె ఈ అధికారిక పర్యటనను ప్రారంభించారు. ఈ ప్రతినిధి బృందంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద కూడా ఉన్నారు. రెండు దేశాల మధ్య ఆర్థిక, వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం.
ఆగస్టు 19 మరియు 20 తేదీల్లో జరిగే ఈ రౌండ్‌టేబుల్ సమావేశాల్లో ముఖ్యంగా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్ సప్లై చైన్, మరియు సరిహద్దు పెట్టుబడులపై ఇరు దేశాల మంత్రులు విస్తృతంగా చర్చించనున్నారు. ముఖ్యంగా సరికొత్త జనరేషన్ (Gen Z) బ్యాంకింగ్ సేవల విస్తరణపై నిపుణులతో సమీక్ష నిర్వహించనున్నారు. గల్ఫ్ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ వాణిజ్యం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సింగపూర్‌తో భారతదేశ భాగస్వామ్యం అత్యంత కీలకమైనదిగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఈ సదస్సు ముగిసిన అనంతరం పలు కీలక ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi