
హైదరాబాద్, 21 ఆగస్టు (హి.స.)
కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానంలో భాగంగా ప్రవేశపెట్టిన మూడు భాషల విధానం (Three-Language Formula) పై సుప్రీంకోర్టు ఇవాళ ఒక కీలకమైన తీర్పును వెలువరించింది. ప్రస్తుతం 6వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం బోర్డు పరీక్షల నుండి ఒకేసారి మినహాయింపు (one-time reprieve) ఇవ్వాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ హఠాత్తు నిర్ణయం వల్ల విద్యార్థులపై తీవ్రమైన మానసిక ఒత్తిడి పెరుగుతుందని దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు ఈ మేరకు స్పందించింది.
న్యాయస్థానం తన వ్యాఖ్యలలో, విద్యా విధానంలో మార్పులు తీసుకురావడం మంచిదే అయినప్పటికీ, విద్యార్థులు మరియు తల్లిదండ్రులపై ఒకేసారి అదనపు భాషా భారాన్ని మోపడం సమంజసం కాదని అభిప్రాయపడింది. ముఖ్యంగా హిందీ యేతర రాష్ట్రాలలో లేదా ప్రాంతీయ భాషలలో చదువుకునే పిల్లలు మూడవ భాషను నేర్చుకోవడానికి, దానికి అనుగుణంగా పరీక్షలు రాయడానికి తగినంత సమయం కావాలని పేర్కొంది. ఈ విధానాన్ని హడావిడిగా కాకుండా, ప్రాథమిక తరగతుల నుంచే క్రమంగా అమలు చేసేలా ఒక శాస్త్రీయ ప్రణాళికను సిద్ధం చేయాలని సీబీఎస్ఈకి సూచించింది. దీనివల్ల పాఠశాలలకు మౌలిక వసతులు, ఉపాధ్యాయులను సమకూర్చుకోవడానికి మరియు విద్యార్థులకు కొత్త భాషను అలవాటు చేసుకోవడానికి తగినంత సమయం లభిస్తుందని పేర్కొంది. విద్యా వ్యవస్థలో పెద్ద మార్పులు తెచ్చేటప్పుడు ఆచరణాత్మక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు స్పష్టం చేయడంతో లక్షలాది మంది విద్యార్థులకు, తల్లిదండ్రులకు పెద్ద ఊరట లభించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi