
హైదరాబాద్, 23 ఆగస్టు (హి.స.)
భారతదేశంలోని అన్ని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాల నుండి విదేశాలకు ప్రయాణించే ప్రయాణికులకు ఒక కీలకమైన డిజిటల్ మార్పు అందుబాటులోకి రానుంది. బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ విభాగం అంతర్జాతీయ ప్రయాణికులకు ఫిజికల్ బోర్డింగ్ పాస్‌లపై స్టాంపింగ్ వేసే సాంప్రదాయ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తూ శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1 నుండి ఈ కొత్త నిబంధన అమలులోకి రానుంది. ఇకపై విదేశీ ప్రయాణికులు ఎయిర్‌పోర్టులలో కాగితపు బోర్డింగ్ పాస్‌లను వెంటబెట్టుకుని లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు. ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్‌లలో డౌన్‌లోడ్ చేసుకున్న అధికారిక ఈ-బోర్డింగ్ పాస్‌ను (e-boarding pass) ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్ద చూపిస్తే సరిపోతుంది. డిజిటల్ స్కానింగ్ ద్వారానే వారి వివరాల ధృవీకరణ పూర్తవుతుంది. ఈ నిర్ణయం వల్ల విమానాశ్రయాలలో ప్రయాణికుల నిరీక్షణ సమయం భారీగా తగ్గుతుందని, బోర్డింగ్ ప్రక్రియ మరింత వేగంగా మరియు పర్యావరణహితంగా మారుతుందని పౌర విమానయాన శాఖ అధికారులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi