ఉల్లి ధరలు.. నియంత్రణకు కేంద్రం చర్యలు
ఉల్లి ధరలు.. నియంత్రణకు కేంద్రం చర్యలు
Onion


హైదరాబాద్, 24 ఆగస్టు (హి.స.) దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డ ధరలు

(Onion Price) అమాంతం పెరిగిపోయాయి. ఉల్లిధర వింటే సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. దాంతో ఉల్లిగడ్డ ధరలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం (Union Govt) రంగంలోకి దిగింది. ఇందులోభాగంగా బఫర్ నిల్వల (Buffer Stock) ను ఉల్లిధర అధికంగా ఉన్న ప్రధాన నగరాలకు తరలిస్తోంది. ఇందుకోసం 'కందా ఎక్స్ప్రెస్ (Kanda Express)' ల పేరుతో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇవాళిటి నుంచే ఈ రైళ్ల సేవలు ప్రారంభమయ్యాయి.

దేశంలోనే అతిపెద్ద ఉల్లి ఉత్పత్తిదారు అయిన మహారాష్ట్రలో ఈసారి ఖరీఫ్ పంట దిగుబడి 5 నుంచి 7 శాతం వరకు తగ్గడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పంట సాగు విస్తీర్ణం తగ్గడం, రుతుపవనాలు ఆలస్యం కావడం వంటివి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపాయి. పాత నిల్వలు అడుగంటి కొత్త పంట మార్కెట్లోకి రావడానికి మధ్య ఏర్పడిన ఈ అంతరం కూడా ధరల పెరుగుదలకు దోహదపడింది.

ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతం నుంచి ఢిల్లీ, చెన్నై, కొచ్చి, గువహటి వంటి నగరాలకు ప్రత్యేక రైళ్ల ద్వారా ఉల్లిని తరలించనున్నారు. వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే ఈ ప్రణాళికను ధృవీకరించారు. అధిక ధరలున్న మార్కెట్లలో సరఫరా పెంచి, ధరలు మరింత పెరగకుండా నిరోధించడమే తమ లక్ష్యమని ఆమె స్పష్టంచేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నాఫెడ్ (NAFED), ఎన్సీసీఎఫ్ (NCCF) సంస్థలు సుమారు 1.2 లక్షల టన్నుల ఉల్లిని సేకరించాయని, ప్రభుత్వంతోపాటు రైతుల వద్ద కూడా తగినన్ని నిల్వలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.

కాగా, 'ధరల స్థిరీకరణ నిధి' కింద ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపట్టడం కొత్తేమీ కాదు. గతంలో 2024 అక్టోబర్లోనూ ఉల్లి ధరల నియంత్రణకు ఇలాంటి ప్రత్యేక రైళ్లనే వినియోగించారు. ఉల్లితోపాటు చక్కెర ధరలు కూడా పెరిగినప్పటికీ (లూజ్ చక్కెర కిలో రూ. 62.5) దేశంలో తగినన్ని నిల్వలు ఉన్నాయని ఆహార మంత్రిత్వ శాఖ పేర్కొన్నది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande