
హైదరాబాద్, 24 ఆగస్టు (హి.స.)
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా తరలిస్తున్న భారీ చికెన్ వ్యర్థాల అక్రమ రవాణాను అధికారులు అడ్డుకున్నారు. ఏపీలోని చేపల చెరువులకు దాణాగా వేసేందుకు అక్రమ మార్గంలో తరలిస్తున్న దాదాపు 100 టన్నుల మాంసపు వ్యర్థాలను సైబరాబాద్ పోలీసులు, వెటర్నరీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో సీజ్ చేశారు.
నగరంలోని వివిధ కోళ్ల దుకాణాలు, మాంసం ప్రాసెసింగ్ యూనిట్ల నుంచి వెలువడే వ్యర్థాలను కొందరు అక్రమార్కులు సేకరించి, లారీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని చేపల చెరువులకు తరలిస్తున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు, పశువైద్య అధికారులు వాహనాలను తనిఖీ చేసి ఈ 100 టన్నుల వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇలాంటి అపరిశుభ్రమైన, ప్రమాదకరమైన చికెన్ వ్యర్థాలను మేతగా వేసి పెంచిన చేపలను వినియోగించడం వల్ల ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని అధికారులు హెచ్చరించారు. ఈ తరహా కలుషిత చేపలను ఆహారంగా తీసుకోవడం వల్ల పలు రకాల వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ అక్రమ రవాణాదారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi