
బెంగళూరు, 26 ఆగస్టు (హి.స.)
కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) మరియు నగర పాలక సంస్థ అధికారులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. నగరంలోని ప్రముఖ ఫైవ్ స్టార్ క్లబ్‌లు, పబ్‌లు మరియు హై-ఎండ్ రెస్టారెంట్లలో ఆహార నాణ్యతను పరిశీలించేందుకు ఈ తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పలు ప్రముఖ క్లబ్‌ల వంటశాలలలో గడువు ముగిసిన మాంసం, నిషేధిత రసాయనాలు కలిపిన పదార్థాలు, మరియు అత్యంత అపరిశుభ్రమైన నీటిని ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఆహార పదార్థాల నిల్వ ప్రాసెస్ కూడా సరైన పద్ధతిలో జరగడం లేదని కనుగొన్నారు.
నిబంధనలు ఉల్లంఘించిన 10 ప్రముఖ క్లబ్‌లకు అధికారులు తక్షణమే నోటీసులు జారీ చేసి, రూ. 15 లక్షలకు పైగా భారీ జరిమానాలు విధించారు. శుభ్రత లోపించిన వంటశాలలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించారు. ప్రజా ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసే ఎంతటి పెద్ద సంస్థలపైనైనా కఠిన చర్యలు తప్పవని ఆహార భద్రతా కమిషనర్ హెచ్చరించారు. నగర ప్రజలు బయటి ఆహారం తినేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, రాబోయే రోజుల్లో హోటళ్లు, హాస్టళ్లు మరియు కేఫ్‌లలో కూడా ఇటువంటి మెరుపు దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi