నేపాల్, టిబెట్ సరిహద్దుల్లో భారీ వరదలు – చిక్కుకున్న 290 మంది భారతీయుల రక్షణకు రంగంలోకి MEA
నేపాల్, టిబెట్ సరిహద్దుల్లో భారీ వరదలు – చిక్కుకున్న 290 మంది భారతీయుల రక్షణకు రంగంలోకి MEA
nepal


హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.)

హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్న హ్యాంగింగ్ గ్లేసియర్లు (మంచు పలకలు) ఒక్కసారిగా విరిగిపడటంతో నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో అకస్మాత్తుగా పెను ఉప్పెన లాంటి వరదలు (Flash Floods) సంభవించాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా హిమాలయాల్లో మంచు కరిగి ఈ విపత్తు సంభవించినట్లు పర్యావరణ శాస్త్రవేత్తలు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ వరదల ధాటికి నేపాల్ వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య ఇప్పటికే దాదాపు 390 దాటిపోయింది. వందలాది మంది కొట్టుకుపోగా, వేలాది మంది గమ్యం తెలియక అడవుల్లో, ఎత్తైన కొండలపై చిక్కుకుపోయారు. ఈ సీజన్‌లో ట్రెక్కర్లు, హిందూ యాత్రికులు నేపాల్ మరియు మానససరోవర్ ప్రాంతాలకు భారీగా తరలివెళ్తుంటారు. ఈ క్రమంలోనే భారతదేశానికి చెందిన సుమారు 290 మంది పర్యాటకులు, యాత్రికులతో పూర్తి సంబంధాలు తెగిపోయాయి. కుటుంబ సభ్యులకు వారి గురించి ఎలాంటి సమాచారం లభించకపోవడంతో ఆందోళన నెలకొంది.

ఈ అత్యవసర పరిస్థితిని గమనించిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తక్షణమే స్పందించింది. బాధితుల సమాచారం తెలుసుకోవడానికి మరియు సహాయక చర్యలను పర్యవేక్షించడానికి 24 గంటలు పనిచేసే ప్రత్యేక నియంత్రణ గదిని (Helpline Control Room) దౌత్య కార్యాలయం ఏర్పాటు చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ ప్రధానమంత్రితో స్వయంగా ఫోన్ ద్వారా మాట్లాడి, అక్కడ జరుగుతున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. భారతదేశం తరఫున అవసరమైన అన్ని రకాల సాంకేతిక, మానవీయ సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.

ప్రస్తుతం రంగంలోకి దిగిన ప్రత్యేక రెస్క్యూ టీమ్స్ ఆ ప్రాంతంలో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఇప్పటివరకు అందిన తాజా సమాచారం ప్రకారం, తీవ్ర ప్రతికూల వాతావరణం, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మధ్యే 84 మంది భారతీయ పౌరులను సురక్షితంగా రక్షించి బేస్ క్యాంపులకు తరలించారు. మిగిలిన వారిని కూడా సురక్షితంగా తీసుకురావడానికి హెలికాప్టర్ల ద్వారా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. నేపాల్‌లో ఉన్న జలవిద్యుత్ కేంద్రాలు కూడా ఈ వరదల వల్ల దెబ్బతినడంతో, అక్కడి నుండి భారతదేశానికి వచ్చే విద్యుత్ సరఫరాకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. సరిహద్దు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలను కేంద్ర రక్షణ శాఖ అప్రమత్తం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande