
హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.)
భారీ వర్షాలు, హిమని నది లో మంచు
పర్వతం కూలిపోవడంతో నేపాల్-టిబెట్ సరిహద్దు (Flash floods) ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. బుధవారం సంభవించిన ఈ జల ప్రళయం నేపాల్ దేశంలోని పలు జిల్లాల్లో పెను విధ్వంసాన్ని మిగిల్చింది. వరదల ధాటికి కొన్ని గ్రామాలు కనుమరుగవ్వగా.. వరదలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతుండడంతో అక్కడ తీవ్ర విషాదం అలముకుంది. ఇప్పటివరకు ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య 469 దాటినట్లు అధికార వర్గాలు ధ్రువీకరించాయి. మరోవైపు గల్లంతైన వారి సంఖ్య కూడా భారీగా పెరిగి 1,468కి చేరినట్టు అధికారులు వెల్లడించారు. మిస్ అయిన వారిలో దాదాపు 290 మంది భారతీయ పౌరులు ఉన్నట్లు గుర్తించడంతో వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో నేపాల్ ఆర్మీ, రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. నదీ తీర ప్రాంతాలు, కొండచరియలు విరిగిపడిన చోట్ల బురద, శిథిలాలను తొలగిస్తూ ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా అనే ఆశతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా, వాతావరణ పరిస్థితులు ఇంకా పూర్తిగా అనుకూలించకపోవడంతో మరోసారి ఎక్కడ ఉప్పెనలా భారీ వరదలు పోటెత్తుతాయోనన్న భయంతో స్థానిక ప్రజలు, పర్యాటకులు తీవ్ర భయాందోళనల మధ్య బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..