
న్యూఢిల్లీ, 28 ఆగస్టు (హి.స.)
కుల ఆధారిత రిజర్వేషన్ల స్థానంలో
ఆర్థిక ప్రాతిపదికన మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలని 'రిజర్వేషన్ హఠావో ఆందోళన్' ('Reservation Hathao Andolan') పేరిట దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువత చేపట్టిన ఈ నిరసనలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆగస్టు 21న జంతర్ మంతర్ వద్ద జరిగిన భారీ ఆందోళనల అనంతరం.. నిరసనకారుల ప్రతినిధి బృందంతో కేంద్ర మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. హర్ష్ దూబే, రణ్ బహదూర్ సింగ్ చౌహాన్, మృత్యుంజయ్ పాఠక్లతో కూడిన బృందంతో ముందస్తు షెడ్యూల్ ప్రకారం సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని, ఈ అంశంపై త్వరలోనే మరోసారి భేటీ అయి చర్చిస్తామని జేపీ నడ్డా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.
రిజర్వేషన్ల విధానంలో మార్పులు తేవాలని, 'ఒకే కుటుంబం - ఒకే రిజర్వేషన్' విధానాన్ని అమలు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర మంత్రితో జరిగిన ఈ చర్చలు సమస్య పరిష్కారానికి తొలి అడుగని 'రిజర్వేషన్ హఠావో ఆందోళన్' ప్రతినిధి హర్ష్ దూబే పేర్కొన్నారు. అయితే తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో జంతర్ మంతర్ వద్ద మరింత భారీ స్థాయిలో ఆందోళనలను ఉధృతం చేస్తామని నిరసనకారులు స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..