
మార్కాపురం , 28 ఆగస్టు (హి.స.) ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా పరిధిలో రెండు నెలల క్రితం జరిగిన ఓ వివాహిత దారుణ హత్య ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చి తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా నివాసముండే ఆదిలక్ష్మి (32) అనే మహిళకు భారీగా వడ్డీ ఆశ చూపిన మరో మహిళ ఆమెను నమ్మించింది. అధిక వడ్డీ వస్తుందన్న ఆశతో ఆదిలక్ష్మి తన బంగారు ఆభరణాలను విక్రయించడంతో పాటు ఇతరుల వద్ద అప్పులు చేసి సుమారు ₹50 లక్షల నగదును నిందితురాలికి ఇచ్చింది. అయితే గడువు ముగిసినా డబ్బులు తిరిగి ఇవ్వకపోగా కాలయాపన చేస్తుండటంతో, తన నగదు తిరిగి ఇవ్వాలంటూ ఆదిలక్ష్మి గట్టిగా ఒత్తిడి చేయడం ప్రారంభించింది.
డబ్బులు తిరిగి ఇవ్వడం ఇష్టం లేని నిందితురాలు ఆదిలక్ష్మిని అంతమొందించాలని పథకం పన్నింది. నగదు ఇస్తానని నమ్మించి ఇంటికి పిలిపించుకుని ఆమెను దారుణంగా హత్య చేసింది. అనంతరం సాక్ష్యాధారాలు లభించకుండా ఉండేందుకు మృతదేహాన్ని ఓ ప్లాస్టిక్ డబ్బాలో కుక్కి సమీపంలోని వ్యవసాయ పొలంలో గుట్టుచప్పుడు కాకుండా పాతిపెట్టింది. భార్య కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో నిందితురాలిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఈ కిరాతక హత్య బట్టబయలైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV