కృష్ణ జిల్లా గుడివాడలో చిట్టీల వ్యాపారం పేరుతో మోసం
కృష్ణ జిల్లా గుడివాడలో చిట్టీల వ్యాపారం పేరుతో మోసం
fraud


కృష్ణాజిల్లా, 29 ఆగస్టు (హి.స.) కృష్ణాజిల్లాలోని గుడివాడలో చిట్టీల వ్యాపారం పేరుతో మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై వైసీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై గుడివాడ వన్టౌన్ పోలీసులు చర్యలు చేపట్టారు. మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరులు మండాది శ్రీనివాసరావు, ఆయన భార్య మహాలక్ష్మి, కుమారుడు రేవంత్ సాయిపై చీటింగ్ కేసు నమోదు చేశారు.

బాధితుల ఫిర్యాదు మేరకు రూ.51.79 లక్షల మేర మోసం జరిగినట్లు కేసు నమోదైంది. U 318(4), 316(2), 351(2) r/w 3(5) BNS, అలాగే AP Protectors of Depositors of Financial Establishments Act-1999లోని సెక్షన్ 5 కింద గుడివాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మహాలక్ష్మి, ఆమె కుమారుడు రేవంత్ సాయిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రధాన నిందితుడిగా పేర్కొన్న మండాది శ్రీనివాసరావు ప్రస్తుతం పరారీలో ఉండటంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పోలీసుల దర్యాప్తులో భాగంగా నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 32 మంది చిరు మత్స్యకార కుటుంబాలకు చెందిన సొమ్ము చిట్టీల పేరుతో తీసుకుని తిరిగి చెల్లించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇంకా అనేక కుటుంబాలు తమకు జరిగిన నష్టంపై బయటకు వచ్చి ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది.

మండాది శ్రీనివాసరావు, మహాలక్ష్మి దంపతులు సుమారు 20 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారని, ఈ క్రమంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడబెట్టినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

ఇదిలా ఉండగా, బాధితులు జూలై 31న ఫిర్యాదు చేసినప్పటికీ వెంటనే కేసు నమోదు కాలేదని ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఈ వ్యవహారంపై మీడియాలో కథనాలు రావడంతో నిందితులు ఇంట్లోని సామాన్లతో వెళ్లిపోయేందుకు ప్రయత్నించారని, బాధితులు అడ్డుకోవడంతో వారిని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. మరోవైపు బాధితులపైనే సుమారు రూ.38.60 లక్షలకు ఐపీ నోటీసులు పంపినట్లు కూడా సమాచారం. దీంతో వివాదం మరింత ముదిరినట్లు తెలుస్తోంది.

చివరకు బాధితుల ఫిర్యాదులపై స్పందించిన గుడివాడ వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. చిట్టీల పేరుతో ఇంకా ఎంతమంది నుంచి డబ్బులు వసూలు చేశారు? ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి? నిందితుల ఆస్తులకు ఈ వ్యవహారంతో సంబంధం ఉందా? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande