
విజయవాడ, 29 ఆగస్టు (హి.స.)
పుణ్యక్షేత్రాలకు వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం భారత్ గౌరవ్ టూరిస్ట్ ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు ఐఆర్సీటీసీ విజయవాడ ప్రాంతీయ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అయోధ్య, కాశీ, బైద్యనాథ్ ధామ్ పేరుతో మొత్తం 10 పగళ్లు, 9 రాత్రులతో గల ఈ ప్యాకేజీలో రైలు అక్టోబరు 24న సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది. విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమహేంద్రవరం, సామర్లకోట, తుని మీదగా పూరీ జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం, బైద్యనాథ్ ఆలయం, వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ ఆలయాలు, సాయంత్రం గంగా హారతి, అయోధ్యలో రామజన్మభూమి, హనుమాన్ ఆలయం, సరయూ నది హారతి, ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం తదితర పుణ్యక్షేత్రాలను సందర్శించి రైలు నవంబరు 2వ తేదీ తిరుగు ప్రయాణం అవుతుంది. టీ, టిఫిన్, భోజనం, రవాణా, హోటల్ గదులు, ఇన్సూరెన్స్తో కలిపి టికెట్ ధర ఒక్కొక్కరికీ స్లీపర్ తరగతిలో రూ.17వేలు, థర్డ్ ఏసీలో రూ.26,400, సెకెండ్ ఏసీలో రూ.34,400 ఉంటుంది. టికెట్ల బుకింగ్ ఇతర వివరాల కోసం ఫోన్ నంబరు 92810 30714లో సంప్రదించాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ