సైబర్ క్రైంలోనూ గోల్డెన్ అవర్ కీలకం
సైబర్ మోసాల్లోనూ ‘గోల్డెన్ అవర్’ కీలకమని పోలీసులు అంటున్నారు. ఆన్లైన్ మోసానికి గురైన వెంటనే బాధితులు ఫిర్యాదు చేస్తే మోసగాళ్ల ఖాతాల్లోకి వెళ్లిన డబ్బును రికవరీ చేయవచ్చని చెబుతున్నారు.
Cyber crime


హైదరాబాద్, 29 ఆగస్టు (హి.స.) సైబర్ మోసాల్లోనూ ‘గోల్డెన్ అవర్’ కీలకమని పోలీసులు అంటున్నారు. ఆన్లైన్ మోసానికి గురైన వెంటనే బాధితులు ఫిర్యాదు చేస్తే మోసగాళ్ల ఖాతాల్లోకి వెళ్లిన డబ్బును రికవరీ చేయవచ్చని చెబుతున్నారు. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. బ్యాంకు అధికారుల పేరుతో ఫోన్ చేయడం, కేవైసీ అప్డేట్, కరెంట్ బిల్లు, కొరియర్, ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడులపై అధిక లాభాలు, డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరింపులు.. ఇలా వివిధ రకాల మోసాలతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.

సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్ ద్వారా పరిచయాలు పెంచుకుని మోసాలకు పాల్పడుతున్న కేసులు నమోదవుతున్నాయి. మోసాల బారిన పడిన బాధితులు 1930కు, సంబంధిత సైబర్ క్రైం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. లావాదేవీల వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఫోన్ నంబర్లు, మెసేజ్లు, స్ర్కీన్షాట్లు, లింకులు వంటి ఆధారాలను భద్రపరచాలని పేర్కొన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నారు.

విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, వృద్ధులు, మహిళలు, బ్యాంకింగ్ వినియోగదారులు తదితర వర్గాలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆన్లైన్లో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయొద్దని, ఓటీపీ, డెబిట్, క్రెడిట్ కార్డుల పిన్, పాస్వర్డ్, సీవీవీ వంటి వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దంటున్నారు. అనుమానాస్పద మెసేజ్లు, లింక్లు, కాల్స్పట్ల, క్రిప్టో, యూపీఐ, ఇతర డిజిటల్ మార్గాల్లో నగదు బదిలీ, టెలిగ్రామ్లో తెలియని వ్యక్తులు, గ్రూపులు, లింకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande