
న్యూఢిల్లీ, 29 ఆగస్టు (హి.స.)
ఐఐటీ ఢిల్లీలో ఎంఎస్సీ ఫిజిక్స్ విద్యార్థి రిషికేష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన క్యాంపస్లో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. విద్యార్థి మృతికి న్యాయం చేయాలని, అధికారుల నిర్లక్ష్యంపై జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో క్యాంపస్ వాతావరణాన్ని భగ్నం చేస్తే కఠిన క్రమశిక్షణా చర్యలు తప్పవని ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ రంగన్ బెనర్జీ విద్యార్థులను గట్టిగా హెచ్చరించారు. ఈ మేరకు విద్యార్థులకు పంపిన అధికారిక ఈ-మెయిల్లో ఆయన స్పందిస్తూ.. గురువారం (ఆగస్టు 27) రాత్రి సమయంలో పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా మారాయని పేర్కొన్నారు.
రాత్రి 10:30 గంటల నుంచి అర్ధరాత్రి 12:30 గంటల వరకు ఆందోళనకారులు తమ నిరసనలను క్యాంపస్లోని రెసిడెన్షియల్ ప్రాంతాలకు విస్తరించి, ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీ నివాసాల ముందు భారీ ఎత్తున ధర్నాలకు దిగడాన్ని డైరెక్టర్ తీవ్రంగా ఆక్షేపించారు. నివాస ప్రాంతాలు, తరగతి గదులు, ఇతర విద్యా సంబంధిత కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై సంస్థ నిబంధనల ప్రకారం చట్టపరమైన, క్రమశిక్షణా చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అయితే యాజమాన్యం తీరుపై విద్యార్థి సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో క్యాంపస్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..