
హైదరాబాద్, 29 ఆగస్టు (హి.స.) హైదరాబాద్లోని సంతోష్నగర్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్నగర్ వాటర్ ట్యాంక్ సమీపంలో ఓ భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి ఫెరోజ్ బిన్ సుల్తాన్ (24) అనే యువకుడు మృతి చెందాడు. ఖలందర్ నగర్కు చెందిన ఫెరోజ్ మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. మంగళవారం మద్యం మత్తులో ఫెరోజ్ ఓ ఇంట్లోకి చొరబడి న్యూసెన్స్ చేశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో స్థానికులు అతడిని పట్టుకుని కొట్టి అనంతరం పోలీసులకు అప్పగించారు. అనంతరం ఫెరోజ్ను కుటుంబసభ్యులకు అప్పగించేందుకు పోలీసులు ఆటోలో ఇంటికి పంపుతున్న సమయంలో మార్గమధ్యంలో అతడు ఆటో నుంచి దిగాడు.
ఆ తర్వాత సంతోష్నగర్ వాటర్ ట్యాంక్ సమీపంలోని ఓ భవనం వద్దకు వెళ్లిన ఫెరోజ్.. నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకినట్లు స్థానికులు చెబుతున్నారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఫెరోజ్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మద్యం మత్తులోనే భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు చెబుతుండగా.. తన భర్తను హత్య చేసి ఉంటారని ఫెరోజ్ భార్య అనుమానం వ్యక్తం చేసింది. దీంతో యువకుడి మృతికి అసలు కారణం ఏమిటన్నది ప్రస్తుతం సస్పెన్స్గా మారింది.
ఈ ఘటనపై ఐఎస్ సదన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, ఫెరోజ్ భవనం వద్దకు ఎలా చేరుకున్నాడు, మృతికి ముందు ఏం జరిగిందనే అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అవసరమైన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చే వివరాల ఆధారంగా ఫెరోజ్ మృతిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్