
కర్నూలు, 29 ఆగస్టు (హి.స.): తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ తెలుగు రచయిత, భాషా శాస్త్రవేత్త గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించుకుంటామని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం పోస్టు పెట్టారు.
గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా నిర్వహించుకునే తెలుగు భాషా దినోత్సవం తెలుగు భాష ప్రాశస్త్యాన్ని మరింత పెంచుతుందనడంలో సందేహం లేదని సీఎం తెలిపారు. తెలుగు భాష పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు ప్రజలు అందరికి సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
వాడుక భాషోద్యమానికి ఆద్యుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘననివాళులు అర్పిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. తెలుగు భాషా వికాసానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వారి కృషికి గుర్తింపుగా ప్రతి ఏటా జరిపే తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV