
న్యూఢిల్లీ/తాష్కెంట్:, 31 ఆగస్టు (హి.స.)
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉజ్బెకిస్తాన్ పర్యటన ఇరు దేశాల దౌత్య సంబంధాలలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ప్రధాని మోదీ మరియు ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయెవ్ మధ్య జరిగిన ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు అత్యంత విజయవంతమయ్యాయి. ఇరు దేశాలు తమ ప్రస్తుత సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం (Comprehensive Strategic Partnership) స్థాయికి పెంచుకుంటూ కీలక నిర్ణయం తీసుకున్నాయి.
ఈ పర్యటనలో భాగంగా మైనింగ్, పర్యాటకం, డిజిటల్ కనెక్టివిటీ, రక్షణ మరియు విద్య వంటి వివిధ రకాల కీలక రంగాలలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇరుపక్షాలు 11 వ్యూహాత్మక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది భారతదేశ పౌర అణుశక్తి రంగానికి సంబంధించిన ఒప్పందం. భారతదేశానికి ఉజ్బెకిస్తాన్ నుండి దీర్ఘకాలికంగా యురేనియం సరఫరా చేయడానికి ఒక ప్రత్యేక ఫ్రేమ్‌వర్క్ ఒప్పందాన్ని ఖరారు చేశారు. ఇది భారతదేశ ఇంధన భద్రతకు ఎంతగానో దోహదపడనుంది.
ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఇరు దేశాలు ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసుకున్నాయి. దీని ప్రకారం రాబోయే 2030 నాటికి వార్షిక ద్వైపాక్షిక వాణిద్యాన్ని 5 బిలియన్ డాలర్ల ( $5 Billion ) మార్కుకు చేర్చాలని ఒక ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ప్రధాని మోదీ ఈ పర్యటనలో తాష్కెంట్‌లోని చారిత్రాత్మక లాల్ బహదూర్ శాస్త్రి స్మారక చిహ్నాన్ని సందర్శించి నివాళులర్పించారు. శాస్త్రి గారు ఇరు దేశాల మధ్య శాంతికి చిహ్నంగా నిలిచారని కొనియాడారు. ఈ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ 26వ ఎస్‌సిఓ (SCO) సదస్సులో పాల్గొనడానికి కిర్గిజ్ రిపబ్లిక్‌కు బయలుదేరి వెళ్లారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi