
కర్నూలు, 31 ఆగస్టు (హి.స.) రాయలసీమను 'రతనాల సీమ'గా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీరు, రహదారులు, అటవీ శాఖల ద్వారా సీమలోని ఎనిమిది జిల్లాల్లో రూ. 8,022 కోట్ల విలువైన పనులను ముందుకు తీసుకెళ్తున్నారు. రాయలసీమ వెనుకబాటుతనాన్ని దృష్టిలో ఉంచుకుని తన శాఖల పరిధిలో కేటాయింపులు, పనుల అమలులో ఈ ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార, పల్లె పండుగ, పల్లె పండుగ 2.0 వంటి కార్యక్రమాల ద్వారా సీమ గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు.
సీమ నుంచే శ్రీకారం..
పంచాయతీరాజ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే రాష్ట్రవ్యాప్త గ్రామసభలను రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మైసూర్ వారిపల్లి నుంచే పవన్ కల్యాణ్ ప్రారంభించారు. అలాగే కర్నూలు జిల్లా ఓర్వకల్లు నుంచి ఫారం పాండ్ల నిర్మాణం, జాతీయ స్థాయి వీబీజీ-రాంజీ కార్యక్రమాలకు రాయలసీమనే వేదికగా ఎంచుకోవడానికే ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. ప్రాంతీయ వెనుకబాటుతనాన్ని పారద్రోలడమే ధ్యేయంగా తన శాఖలకు సంబంధించిన కీలక కేటాయింపుల్లో సీమ జిల్లాలకు అగ్రతాంబూలం అందిస్తున్నారు.
వ్యవసాయం, ఉద్యాన రంగానికి ఊతం..
రైతులకు సాగునీటి కొరత తీర్చేందుకు చేపట్టిన ఫారం పాండ్ల ద్వారా అదనంగా 50 వేల ఎకరాలు సాగులోకి వచ్చాయి. దీనివల్ల రైతులకు రూ. 55 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించి 62 వేల ఎకరాల్లో రూ. 200 కోట్లతో ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తున్నారు. అలాగే పాడి రైతులకు భరోసానిస్తూ రూ. 170 కోట్లతో 15 వేల మినీ గోకులాలు, పశువుల షెడ్లను అందుబాటులోకి తెచ్చారు.
తాగునీరు, రహదారుల అనుసంధానం..
తాగునీటి సమస్య పరిష్కారానికి జల్ జీవన్ మిషన్ కింద రూ. 2,782 కోట్లతో పులివెందుల, డోన్ వాటర్ స్కీమ్లతో పాటు చిత్తూరు మెగా వాటర్ గ్రిడ్ పనులు వేగవంతం చేశారు. మరోవైపు రూ. 4,523 కోట్లతో 23 వేలకు పైగా గ్రామీణ రహదారుల పనులు చేపట్టారు. ఇప్పటికే వేలాది కిలోమీటర్ల బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయింది.
పర్యావరణం, పారిశుద్ధ్యం..
ఏనుగుల దాడి నుంచి పంటలను కాపాడేందుకు ముసలమడుగులో కుంకీ ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి నష్టాన్ని గణనీయంగా తగ్గించారు. రూ. 26 కోట్లతో 13 నగర వనాలను పెంచడంతో పాటు, గ్రామాల్లో భూగర్భ జలాలు పెంచేందుకు ఇంకుడు గుంతలు, మ్యాజిక్ డ్రెయిన్లను విస్తృతంగా నిర్మిస్తున్నారు. ఈ సమగ్ర చర్యలతో సీమ గ్రామీణ ముఖచిత్రం వేగంగా మారుతోంది.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV