
హైదరాబాద్, 05 ఆగస్టు (హి.స.) ఇంజినీరింగ్ కళాశాలల్లో మొత్తం 80 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఈసారి కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత బ్రాంచీల్లో భారీగా సీట్లు మిగిలిపోయాయి... 82 శాతమే నిండాయి. చివరి విడత సీట్లను మంగళవారం కేటాయించారు. తాజా విడతలో కొత్తగా 3,281 మంది సీట్లు సాధించారు. ఎప్సెట్ కౌన్సెలింగ్లో కన్వీనర్ కోటా కింద ఈడబ్ల్యూఎస్ సీట్లతో కలుపుకొని 94,156 సీట్లు అందుబాటులో ఉండగా... చివరి విడత నాటికి 75,054 సీట్లు నిండాయి... 19,102 సీట్లు మిగిలిపోయాయి. సీఎస్ఈ, సంబంధిత 19 బ్రాంచీల్లో 66,390 సీట్లుండగా... 54,730 సీట్లు నిండాయి. ఏకంగా 11,660 సీట్లు మిగిలాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ విభాగంలో తొమ్మిది బ్రాంచీలున్నాయి. వాటిల్లో 18,759 సీట్లకు 14,127( 75 శాతం) భర్తీ అయ్యాయి. సివిల్, మెకానికల్ సంబంధిత విభాగంలోని బ్రాంచీల్లో 7,872 సీట్లకు 5,378(68 శాతం) నిండాయి. అయితే తాజాగా సీట్లు పొందిన వారిలో కొన్ని వందల మంది చేరకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
7 లోపు కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి...
సీట్లు పొందిన వారు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఈనెల7 లోపు అలాట్మెంట్ లెటర్లో పేర్కొన్న ట్యూషన్ ఫీజును వెబ్సైట్ ద్వారా చెల్లించాలి. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి... కళాశాలల్లో స్వయంగా రిపోర్ట్ చేయాలి. రెండో విడతలో సీట్లు పొంది… తాజాగా కళాశాల మారిన వారు, బ్రాంచి మారిన వారు సైతం కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని ఎప్సెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు. సీట్లు పొందిన వారు కళాశాలల్లో బ్రాంచీలు మారేందుకు 12, 13 తేదీల్లో స్లైడింగ్ నిర్వహిస్తామని, ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. బ్రాంచీలు మారినా ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులేనని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్