ఈటెలతో టచ్లో ఉంటే పార్టీ నుంచి ఔట్.. కోవర్టులకు కౌశిక్ రెడ్డి అల్టిమేటం!
ఈటెలతో టచ్లో ఉంటే పార్టీ నుంచి ఔట్.. కోవర్టులకు కౌశిక్ రెడ్డి అల్టిమేటం!
Mla


హుజురాబాద్, 05 ఆగస్టు (హి.స.)

బీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవిస్తూ, లోపాయికారీగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్తో రహస్య రాజకీయాలు నడుపుతున్న కోవర్టులపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవర్టు రాజకీయాలకు స్వస్తి చెప్పండి... లేదంటే వెంటనే బీఆర్ఎస్ను వీడి వెళ్లిపోండి! అంటూ సొంత పార్టీలోని నమ్మకద్రోహులకు స్పష్టమైన అల్టిమేటం జారీ చేశారు.

బుధవారం హుజూరాబాద్లోని కే.సీ. క్యాంప్లో ఉన్న ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముందు ఇటీవల మృతి చెందిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డికి మౌనం పాటించి నివాళులర్పించారు.

అనంతరం సమావేశానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీకి వెన్నుపోటు పొడిచే వారి వైఖరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కోవర్టుల జాతకాలు నా దగ్గరే ఉన్నాయి..

బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉంటూనే రహస్యంగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ద్రోహుల పూర్తి వివరాలు తన వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నచ్చని వ్యక్తులతో చేతులు కలిపి తొత్తులుగా మారితే ఎంతటి వారినైనా సహించబోమని హెచ్చరించారు. గతంలో ఈటల రాజేందర్ వెంట వెళ్లి బీజేపీలో చేరిన కార్యకర్తలను బూత్ స్థాయిలో గుర్తించి, వారిని తిరిగి గౌరవంగా గులాబీ గూటికి తీసుకురావాలని పార్టీ నాయకులకు సూచించారు.కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అంతర్గతంగా నిర్వహించిన సర్వేల్లో కూడా రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ 70కి పైగా స్థానాలు గెలిచి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని తేలిందని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

పార్టీకి కట్టుబడి, నిబద్ధతతో పనిచేసే నాయకులు, కార్యకర్తలకే హుజూరాబాద్ బీఆర్ఎస్లో ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ప్రత్యర్థి ఈటల భజన చేస్తూ పార్టీకి నష్టం చేకూర్చే 'శకుని' పాత్ర పోషిస్తున్న వారికి గులాబీ దళంలో ఏమాత్రం చోటు లేదని, వెంటనే తమ వైఖరి మార్చుకోకపోతే బహిరంగంగా చర్యలు తీసుకుంటామని కౌశిక్ రెడ్డి కుండబద్దలు కొట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande