
హైదరాబాద్, 05 ఆగస్టు (హి.స.)
మద్యం, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు,
చెడు వ్యసనాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండి ఉత్తమ వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. బుధవారం చిక్కడపల్లిలోని బ్రహ్మకుమారీస్ శాఖ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్, మిషన్ స్పందన్ పేరుతో వ్యసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్, చిక్కడపల్లి బ్రహ్మకుమారీస్ ఇంచార్జ్ జయశ్రీ,బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ముచ్చకుర్తి ప్రభాకర్ పలువురు నేతలు కలిసి వ్యసన ముక్తి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ సహకారంతోSay No to Addictions నినాదంతో మద్యం, డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. మత్తు పదార్థాలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయని, యువత వీటి బారిన పడి విలువైన భవిష్యత్తు, కుటుంబాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెడు వ్యసనాలకు ప్రలోభపెట్టే వారి మాటలు విని ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎలాంటి ఒత్తిడిలోనూ మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దని హితవు పలికారు. ధైర్యంగా వాటిని తిరస్కరించాలన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమశిక్షణ, క్రీడలు, యోగా, ధ్యానం, సత్సంగం, నైతిక విలువలతో మంచి అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రష్మిక, లక్ష్మీనారాయణ, రఘుదీర్, శ్యామ్, భూషణ్ తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..