
పెద్దపల్లి, 05 ఆగస్టు (హి.స.)
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రతి
రోగికి నాణ్యమైన, సకాలంలో వైద్య సేవలు అందేలా వైద్యాధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన ఓపీ విభాగం, వార్డులు, ప్రసూతి విభాగం, ల్యాబ్, ఫార్మసీతో పాటు రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఎక్కువ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది సమన్వయంతో గర్భిణుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. హైరిస్క్ గర్భిణులను ప్రత్యేకంగా గుర్తించి మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పారు.
ఆస్పత్రిలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, వార్డులు, మరుగుదొడ్లు, పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. అవసరమైన మందులు, వైద్య పరీక్షలు సకాలంలో అందుబాటులో ఉండేలా చూడాలని, అత్యవసర సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రోగులకు సంతృప్తికరమైన వైద్య సేవలు అందించాలని, వారి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, అవసరం లేని రిఫరల్సు తగ్గించి సాధ్యమైనంత వరకు స్థానికంగానే నాణ్యమైన చికిత్స అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల నమ్మకాన్ని మరింత పెంచేలా ప్రతి ఉద్యోగి సేవాభావంతో పనిచేయాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..