
యాదాద్రి భువనగిరి, 05 ఆగస్టు (హి.స.)
గురుకుల పాఠశాలలో సరుకుల సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత కాంట్రాక్టర్ను బ్లాక్స్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి హెచ్చరించారు.
బుధవారం రాజాపేట మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల, కళాశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌళిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. గతంలో పర్యటన సందర్భంగా వచ్చినప్పుడు సూచించిన పెండింగ్ పనుల పురోగతిని పరిశీలించారు. హాస్టల్లో కిటికీల మరమ్మతులు, డోర్ల ఫిట్టింగ్, మెష్ అమరిక, గదుల్లో వర్షపు నీటి లీకేజీల నివారణ కోసం పైకప్పు ఫ్లాస్టింగ్ పనులను పరిశీలించి, ఇంకా మిగిలిన ఉన్న పనులను కూడా వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హాస్టల్లోని కొన్ని టాయిలెట్లు బ్లాక్ అయి వినియోగానికి అనుకూలంగా లేవని గుర్తించి, సంబంధిత ఎస్.ఈ. వెంటనే మరమ్మతులు చేపట్టి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.
అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, మెనూ ప్రకారం అందించాల్సిన గుడ్లు,చికెన్ వంటి ఆహార పదార్థాలు క్రమం తప్పకుండా అందడం లేదని విద్యార్థులు తెలియజేయడంతో కలెక్టర్ వెంటనే సంబంధిత కాంట్రాక్టర్తో మాట్లాడి ఒప్పందం ప్రకారం సరఫరా జరిగేలా చూడాలని, దీనిపై పాఠశాల ప్రిన్సిపాల్ ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని సూచించారు. సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత కాంట్రాక్టర్ను బ్లాక్స్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ తరగతి గదులను పరిశీలించారు, తరగతి గదులలో గోడలు, పైకప్పుల నుంచి పెచ్చులు ఊడిపోతున్న వాటిని వెంటనే మరమ్మతు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని గురుకుల కళాశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేలా ప్రత్యేక శిక్షణ,అనుభవం కలిగిన లెక్చరర్ డాక్టర్ రాజును నియమించారు. విద్యార్థులు ఉన్నత చదువుల కొరకు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ సుధాకర్, స్థానిక సర్పంచ్ కోయ మధు, తహసీల్దార్ రవి కిరణ్, ఎంపిడిఓ నాగవేణి, ఎంపీఓ కిషన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు